
ఇప్పుడు ఏ సినీ అభిమాని మాట్లాడినా అది తిరిగి తిరిగి ‘బాహుబలి’ గురించే అయి ఉంటోంది. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా ఇప్పటికే జోరుగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ ఎత్తున జూలై 10న విడుదల కానుంది.
బాహుబలి సినిమా విడుదలకు మరింత దగ్గరవుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో సినిమాపై మరికొంత డీటైల్ ఇస్తూ నేడు రెండో ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్‌కు సంబంధించిన సౌండ్ ట్రాక్ నిన్ననే విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోగా, ఆ ట్రాక్‌లో వచ్చే విజువల్స్ ఇంకా ఎలాంటి అనుభూతినిస్తాయో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ గతంలో విడుదలై సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చిన విషయం తెలిసిందే!