నైజాంలో ‘బాహుబలి’ కలెక్షన్స్ ఎంతంటే..!

నైజాంలో ‘బాహుబలి’ కలెక్షన్స్ ఎంతంటే..!

Published on Jul 11, 2015 4:00 PM IST

Baahubali

సగటు సినీ అభిమాని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’.. నిన్న ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని నేపథ్యంలో ‘బాహుబలి’ సినిమాను మొదటి రోజే చూసేయాలన్న ఆతృతలో ప్రతీ సినీ అభిమానీ ఎదురుచూశారు. ఈ క్రమంలోనే మొదటిరోజు తెలుగులో ఈ సినిమాకు కనీవినీ ఎరుగని రీతిలో ఓపెనింగ్స్ వచ్చాయి.

నైజాంలో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ ఎత్తున విడుదల చేసిన విషయం తెలిసిందే! మొదటి రోజు హౌస్‌ఫుల్ షోలతో నడిచిన బాహుబలి, 6.20 కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లో కలుపుకొని ఈ సినిమా 24కోట్ల రూపాయాల షేర్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు సినీ పరిశ్రమలో వేరే ఏ ఇతర సినిమా ఫస్ట్‌డే కలెక్షన్లు బాహుబలి దరిదాపుల్లో కూడా లేవు.

విడుదలైన దగ్గర్నుంచే ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సినిమాలోని గ్రాఫిక్స్, సెట్టింగ్‌లు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, రాజమౌళి విజన్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ చూడనటువంటి గ్రాఫిక్స్‌తో ఈ సినిమా థ్రిల్ చేయడంతో బాహుబలిని దేశవ్యాప్తంగా విజువల్ వండర్‌గా ప్రశంసిస్తున్నారు. శని, ఆదివారాల్లో కూడా ఇదే స్థాయిలో కలెక్షన్లు ఉండనున్నాయని ట్రేడ్ టాక్!

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు కాగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లు ఈ సినిమాను నిర్మించారు.

తాజా వార్తలు