ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : 28 ఆగస్టు, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : నిమిష సజయన్, బరున్ సోబ్తీ, అన్షుమన్ పుష్కర్, రాజేశ్ కుమార్, సునీత రజ్వర్ తదితరులు
దర్శకత్వం : అంబికా పండిత్
నిర్మాతలు : సౌరభ్ మల్హోత్రా, మనోజ్ మిత్ర, టీనా దర్వాణి
సంగీతం : అజయ్ జయంతి
ఛాయాగ్రహణం : సునీల్ రామకృష్ణ బార్కర్
కూర్పు : తాన్యా ఛబ్రియా
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మలయాళ నటి నిమిష సజయన్ నటించిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘బబితా సింగ్ రిపోర్టింగ్’ నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. అంబికా పండిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
బబితా సింగ్ (నిమిష సజయన్) అలియాస్ బేబి మధ్య ప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్-ఇన్స్పెక్టర్గా పని చేస్తుంది. ఒక రోజు తన స్వగ్రామానికి వచ్చిన బబితా, తన చిన్ననాటి స్నేహితుడు బన్సి సింగ్(బరున్ సోబ్తి) చనిపోయినట్లు తెలుసుకుంటుంది. తొలుత సాధారణ మృతిగా భావించినా క్రమంగా ఇదొక మర్డర్‌గా తేలుతుంది. లోకల్ పోలీసులు, తన భర్త, చుట్టాలు బబితాకు పెద్దగా సాయం చేయకపోవడంతో ఆమె స్వయంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆమె ఈ మర్డర్ కేసును ఎలా చేధించింది.. అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ప్రధాన బలం నిమిష సజయన్ అని చెప్పాలి. ఆమె తన పాత్రలో చూపెట్టిన హావభావాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంలో నిమిష సక్సెస్ అయ్యింది. ఆమె తన పాత్ర కోసం బరువు పెరిగిన తీరు నిజంగా అభినందనీయం. ఇక తన పాత్రలో ఆమె పండించిన ఎమోషన్స్, సిస్టమ్‌కు ఎదురెళ్లే మహిళగా చేసిన పర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె నటన అమేజింగ్.
బరున్ సోబ్తి తనకున్న తక్కువ స్క్రీన్ టైమ్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అన్షుమన్ పుష్కర్ బబితా భర్తగా ఆకట్టుకున్నాడు. అత్త పాత్రలో సునీత రజ్వర్, ఎస్ఐగా రాజేశ్ శర్మ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఈ సినిమాలో కేవలం మర్డర్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కథగా కాకుండా, బబితా చుట్టూ జరిగే పరిణామాలు, ఆమె జీవితంలోని పలు అంశాలను కూడా ప్రస్తావించిన తీరు మెప్పిస్తుంది. కేవలం హీరోలా కేసును ఇన్వెస్టిగేట్ చేయడం కాకుండా సాధారణ మహిళ చేసే తప్పులను కూడా ఇందులో చూపెట్టిన తీరు బాగుంది.
మైనస్ పాయింట్స్ :
క్రైమ్ ప్రొసీడింగ్స్ రొటీన్‌గా సాగడం ఈ సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి. ఓటీటీ థ్రిల్లర్స్ రెగ్యులర్‌గా చూసే ఆడియన్స్‌కు ఈ సినిమా కథ ఇట్టే అర్థమవుతుంది. సెకండాఫ్‌లో కొన్ని రిపీటెడ్ సీన్స్ కథ ఫ్లోను దెబ్బతీస్తాయి.
ఈ సినిమా క్లైమాక్స్ ఒక సింపుల్ నోట్‌తో ముగించడం ఈ చిత్రానికి మేజర్ డ్రా బ్యాక్. మర్డర్ కేసుకి సంబంధించి ఏదైనా పెద్ద విషయం రివీల్ అవుతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో కథను చాలా సింపుల్‌గా ముగించారు. దీంతో ప్రేక్షకుల్లో చాలా ప్రశ్నలకు జవాబులు దొరకకుండానే సినిమా ముగియడం మైనస్. ఇన్వెస్టిగేషన్లో పెద్ద ట్విస్టులు ఏమీ లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్. కేవలం హిందీ ఆడియోలో మాత్రమే ఈ సినిమా ఉండటం మైనస్.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాల్లో ఉత్కంఠను బాగా ఎలివేట్ చేశాయి. కథను మరియు పాత్రలను సహజంగా ఆవిష్కరించేలా స్క్రీన్‌ప్లే సాగుతుంది. అయితే రెండున్నర గంటల రన్‌టైమ్ కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉంటే బెటర్‌గా ఉండేది. దర్శకురాలు అంబికా పండిత్ డ్రామాను ఎక్కడా అతిగా చూపించకుండా రియలిస్టిక్‌గా మలుస్తూ, మర్డర్ మిస్టరీలోకి వెళ్లేముందే లీడ్ రోల్ వ్యక్తిగత జీవితం, ఆమె ఎదుర్కొనే బాడీ షేమింగ్, అత్తమామల వైఖరి మరియు భర్త నుంచి ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వంటి అంశాలను ఎంతో చక్కగా తెరకెక్కించారు.
తీర్పు :
మొత్తంగా చూస్తే.. ‘బబితా సింగ్ రిపోర్టింగ్’ సాలిడ్ ట్విస్టుల కంటే పాత్రలు, నటీనటుల పర్ఫార్మెన్స్పై ఆధారపడి సాగే ఒక క్రైమ్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. నిమిష సజయన్ తన అద్భుతమైన నటనతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తుంది. అయితే, కొన్ని రిపీటెడ్ సీన్స్, సింపుల్‌గా సాగే క్లైమాక్స్ ఈ చిత్రానికి మైనస్. క్రైమ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని ఓసారి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team
