భారత్ – పాక్ మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో దేశ ప్రజలు తమ దేశ సైన్యం ఈ యుద్ధంలో గెలవాలని కోరుకుంటున్నారు. అయితే, ఈ వార్‌లో పలువురు సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ కూడా ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో మురళీ నాయక్ మృతి చెందడంతో ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. ఇక పలువురు రాజకీయ నాయకులు ఆయన మృతి పట్ల తమ సంతాపం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, నాయకులు మురళీ నాయక్‌కు తమ నివాళి తెలిపారు.
కాగా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ మురళీ నాయక్ మృతిపై తన సంతాపం తెలిపారు. ఆ వీర జవాన్ కుటుంబానికి తాను అండగా ఉంటున్నట్లు తెలిపిన బాలయ్య, వారికి తన ఒక నెల జీతాన్ని అందించనున్నట్లు ప్రకటించాడు. ఇక మే 12న మురళీ నాయక్ స్వగ్రామంలో ఆయన తల్లిదండ్రులకు ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.
