గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దాదా’. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తోనే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమాపై తాజాగా దర్శకుడు కీలక విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ పాత్రపై ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, బాలయ్య-కాజల్ జోడీ వెండితెరపై కొత్త ఎనర్జీని, సూపర్ కెమిస్ట్రీని తీసుకొస్తుందని తెలిపారు.
వీరిద్దరి కాంబోలో వచ్చే ఊరమాస్ డాన్స్ పెర్ఫార్మెన్సులు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ‘భగవంత్ కేసరి’లో అలరించిన ఈ జోడీ మళ్లీ ‘దాదా’లో ప్రేక్షకులను మైమరపించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటులు శరత్‌కుమార్, సముద్రఖని ఇతర పవర్ఫుల్ రోల్స్‌లో కనిపిస్తారని, త్వరలోనే వారి ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తామని గోపీచంద్ తెలిపారు.
ఇప్పటివరకు చూసింది కేవలం చిన్న శాంపిల్ మాత్రమేనని, సినిమాలో అసలైన డ్రామా చాలా ఉందన్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు స్పష్టం చేశారు. మంచు మనోజ్ పవర్ ఫుల్ విలన్‌గా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
