నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తరపున ఎందరో పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎందరో రోగులకు ఆపన్న హస్తం అందించిన ఆయన తాజాగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలిక పట్ల సత్వరమే స్పందించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాకు చెందిన వెంకట్రామూడు, అరుణల కుమార్తె స్వప్న బోన్ క్యాన్సర్ వ్యాధితో మంచానికి పరిమితమైంది. వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉండటంతో ఆమె తల్లిదండ్రులు దాతల కోసం ఎదురుచూసడసాగారు.
ఈ సంగతిని మీడియా, బసవతారకం ఆసుపత్రి సిబ్బంది ద్వారా తెలుసుకున్న బాలయ్య వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఎలాంటి భయం అక్కర్లేదని, తన ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం, ఆపరేషన్ చేయిస్తామని, వెంటనే హైదరాబాద్ బయలుదేరి రావాలని తెలిపారట. ఇలా బాలకృష్ణ తమ కష్టం తెలుసుకుని స్వయంగా ఫోన్ చేసి హామీ ఇవ్వడంతో స్వప్న తల్లిదండ్రులు ఇక తమ బిడ్డ బ్రతికినట్టేనని సంబరపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులైతే మా బాలయ్య మనసున్న మారాజు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో బాలకృష్ణ చేస్తున్న ‘రూలర్’ చిత్రం డిసెంబర్ 20న విడుదలకానుంది.
