
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాల్లో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి, సాఫ్ట్ సినిమాలతో మిడిల్ లెవెల్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరో నాని.. ఇద్దరి కాంబినేషన్ అంటేనే వినడానికి కొత్తగా ఉంది. ఇక ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే మరింత కొత్తగా ఉంటుందని నాని చెబుతున్నారు. ‘భలే భలే మగాడివోయ్’ పేరుతో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమా దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే!
టైటిల్, పోస్టర్స్‌తోనే మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, ట్రైలర్ రిలీజ్ అయ్యాక విపరీతమైన క్రేజ్‌ను కూడా సంపాదించుకుంది. ఓ మతిమరుపు లవర్‌గా నాని ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ట్రైలర్ చూస్తే, సినిమా నూటికి నూరు పాళ్ళు నవ్విస్తుందనే విషయం స్పష్టమవుతూనే ఉంది. నాని సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వీరిద్దరి పెయిర్ చాలా ఫ్రెష్‌గా ఉండనుందని తెలుస్తోంది.
గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ కూడా ఇప్పటికే సూపర్ హిట్ అయింది. నాని ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నాని సినిమాల్లో ఇప్పటివరకూ ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఉందని సమాచారం. 100% ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ హిట్ ట్రాక్ పట్టాక నాని చేసిన సినిమా అదే జోరు కొనసాగిస్తుందా అన్నది ఎదురుచూడాలి.