
మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తోన్న సినిమా ‘బెంగాల్ టైగర్’. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, రవితేజ స్టైల్లో ఓ మాస్ కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరిన ఈ సినిమాను అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ మధ్యే ‘కిక్ 2’ సినిమాతో అభిమానులను మెప్పించిన రవితేజ, ‘బెంగాల్ టైగర్’తో వెంటనే సిద్ధమైపోవడం విశేషంగా కనిపిస్తోంది.
ఇక ఇప్పటివరకూ ఫస్ట్‌లుక్, స్టిల్స్ ఇలా ఈ సినిమాకు సంబంధించిన వివరాలేవీ విడుదల చేయకుండా సస్పెన్స్‌లో పెట్టిన సినిమా యూనిట్, ఈ ఉదయం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. చుట్టూ పోలీస్ సిబ్బంది గన్స్ రవితేజ మీదకు ఎయిమ్ చేసి ఉన్న ఈ ఫోటోలో రవితేజ తన ఆటిట్యూడ్ స్టైల్‌ను కంటిన్యూ చేస్తూ అదరగొట్టారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. బొమాన్ ఇరానీ, హర్ష వర్ధన్ రానే వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది.