
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘తని ఒరువన్’ సినిమా తెలుగు రీమేక్ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో సురేందర్ రెడ్డి బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ తని ఒరువన్ రీమేక్ ఒప్పుకున్నప్పట్నుంచే ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నారు. అన్ని కమర్షియల్ అంశాలను కలగలుపుకొని రూపొందిన డిఫరెంట్ సినిమా కావడంతో తని ఒరువన్ రీమేక్ తనకు మంచి గుర్తింపు తెస్తుందని చెర్రీ భావిస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే సినిమాను టెక్నికల్‌గానూ టాప్ లెవెల్లో ఉంచేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం ఓ ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్‌ను సంప్రదించారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన భజరంగీ భాయ్‌జాన్, ఏక్ థా టైగర్, ఫాంటమ్ లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన అసీమ్ మిశ్రాను తని ఒరువన్ రీమేక్ కోసం ఒప్పించినట్లు తెలుస్తోంది. తని ఒరువన్ సినిమాను చూసిన అసీమ్ మిశ్రా, తెలుగు రీమేక్‌కు పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖర్లో ఈ సినిమా అఫీషియల్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

