
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో పాగా వేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమాలో తన అందంతో, నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ‘లౌక్యం’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న రకుల్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. తాజాగా రవితేజ ‘కిక్ 2’, రామ్ చరణ్ – శ్రీనువైట్లల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్, త్వరలోనే ఎన్టీఆర్ సినిమాలోనూ నటించేందుకు సిద్ధమైంది.
టాలీవుడ్‌లో ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోవడం పట్ల రకుల్ తన ఆనందాన్ని వెలిబుచ్చింది. “ప్రస్తుతం నాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. నాకున్న అనుభవానికి, వయసుకి ప్రయోగాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ ఇలా పట్టుబట్టి సినిమాలను ఎంచుకోలేను. కాంబినేషన్ నచ్చితే ఒప్పేసుకుంటాను. అయినా నా గురించి, నేను ఎలాంటి పాత్రల్లో నటిస్తే బాగుంటుందన్న విషయం నా దర్శకుల కంటే ఇంకెవరికి తెలుస్తుంది?” అంటూ సమాధానమిచ్చింది.