నటుడు, దర్శకుడు ప్రియదర్శిని రామ్ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘కేస్ 99’. ఇటీవలే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుడల చేసి ఆకట్టుకున్న టీమ్ తాజాగా టీజర్ విడుడల చేశారు. ఈ ఇంటెన్స్ టీజర్ చూస్తే సినిమా ప్రేమ, పెద్దలు అంగీకరించకపోవడం, క్రైమ్, డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అనే అంశాల చుట్టూ అల్లిన కథలా అనిపిస్తోంది. ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ టీజర్ కట్ సినిమాలో థ్రిల్లింగ్ కంటెంట్ ఉంటుందనే హింట్ ఇస్తోంది. ఈమధ్య పలు రాష్ట్రాల్లో పెద్దలను ఎదిరించి ఒక్కటవ్వాలనుకున్న ప్రేమికుల మీద వరుసగా దాడులు జరుగుతుండటం దేశం మొత్తాన్ని విస్మయానికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రియదర్శిని రామ్ అలాంటి దారుణాలను ఎత్తిచూపుతూ ‘కేస్ 99’ సినిమా తీయడం విశేషం. గతంలో ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సైతం ప్రియదర్శిని రామ్ ఏ పనిచేసినా ప్రాణం పెట్టి చేస్తాడని, ఈ సినిమాలో పాలుని, నీటిని వేరుచేసే హంస లాంటి పాత్రతో సమాజంలో జరిగే చెడును బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. ప్రియదర్శిని రామ్ సైతం సమాజంలో క్రైమ్ ఎక్కువైపోయిందని, వాటన్నింటినీ పరిష్కరించలేకపోయినా ఇంకో తన వంతు ప్రయత్నగా ఈ సినిమా చేస్తున్నానని అన్నారు.
అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ కాపీ ఇంకో వారంలో రెడీ కానుంది. మెలోడ్రామా కంపెనీ ద్వారా వివేక్, గౌతమ్, కీర్తిలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తిరువీర్, అనువర్ణ, నిహాల్ కోదాటి, అజయ్ ఖతుర్వార్, అపరాజిత, ప్రణీత పట్నాయక్, క్రియేష్ రాజ్, అశోక్ రావు, విజయ్ గోపరాజు, మనోజ్ ముత్యం, నితిన్, ప్రసన్, రోషన్ కీలక పాత్రలు పోషించారు.
