ఘనంగా ‘చాయ్ వాలా’ టైటిల్ సాంగ్ ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా సజ్జనార్

Chai Wala Movie Title Song Launch

శివ కందుకూరి హీరోగా, హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మిస్తున్న చిత్రం ‘చాయ్ వాలా’. ప్రమోద్ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ కమిషనర్ వి.సి. సజ్జనార్, నీలోఫర్ కేఫ్ ఫౌండర్ బాబురావు, కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

పాటను విడుదల చేసిన అనంతరం కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, మన జీవితంలో ‘చాయ్’ అనేది ఒక ముఖ్యమైన భాగంగా మారిందని, టైటిల్ సాంగ్ చాలా బాగుందని ప్రశంసించారు. యంగ్ టీమ్ చేసిన ఈ ప్రయత్నం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. నీలోఫర్ బాబురావు మాట్లాడుతూ.. తాను చాయ్‌తోనే ఈ స్థాయికి వచ్చానని, చాయ్ అంటే అందరికీ ఒక ఎమోషన్ అని, ఈ టైటిల్ పెట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. “ఇదొక తండ్రీకొడుకుల మధ్య ఉండే బలమైన భావోద్వేగ చిత్రం. ఇంట్లో తండ్రితో చెప్పుకోలేని, బయటకు చూపించలేని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. రాజీవ్ కనకాల గారు తండ్రి పాత్రలో జీవించారు” అని తెలిపారు. ఈ చిత్రంలో తేజు అశ్విని హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. సినిమా చూసి ఆదరించాలని దర్శకనిర్మాతలు కోరారు.

Exit mobile version