చారుశీల.. నా కెరీర్‌లో మరచిపోలేని పాత్ర : శృతి హాసన్

shruthihasaan

సూపర్ స్టార్ మహేష్ బాబు – అందాల తార శృతి హాసన్.. ఈ ఇద్దరి జంట తెరపై ఎంత అందంగా ఉండనుందనేది ‘శ్రీమంతుడు’తో ఋజువైపోయింది. పోస్టర్, ట్రైలర్‌తోనే మహేష్-శృతిల జంటపై విపరీతమైన ఆసక్తి చెలరేగగా, సినిమా విడుదల తర్వాత అంతా ఈ పెయిర్‌ను హిట్ పెయిర్ అనేస్తున్నారు. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ‘శ్రీమంతుడు’, సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. శ్రీమంతుడు విషయంలో కథాంశం, మహేష్ యాక్టింగ్, కొరటాల శివ టేకింగ్‌తో పాటు శృతి హాసన్ రోల్, పర్ఫామెన్స్‌కు కూడా మంచి గుర్తింపు దక్కింది.

‘శ్రీమంతుడు’లో చారుశీల అనే ఓ స్ట్రాంగ్, ఇండిపెండెంట్ వుమెన్‌గా కనిపించి శృతి హాసన్ అలరించారు. ఇక సినిమాకు, తన రోల్‌కు వస్తోన్న స్పందన పట్ల శృతి హాసన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో శృతి హాసన్ మాట్లాడుతూ.. “శ్రీమంతుడు ఇంత పెద్ద విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. చారుశీల నా కెరీర్‌లో మర్చిపోలేని పాత్ర. ఇంట మంచి క్యారెక్టర్ రాసినందుకు, నాకు ఆ రోల్ ఇచ్చినందుకు కొరటాల శివకు కృతజ్ఞతలు. శ్రీమంతుడు సినిమా విషయంలో మహేష్ గారిచ్చిన సపోర్ట్ మరచిపోలేను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, నటుడు జగపతి బాబులతో పాటు చిత్ర నిర్మాతలు కూడా పాల్గొన్నారు.

Exit mobile version