
కుటుంబ విలువలు, ఆప్యాయతలు.. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలుగు తెరపై ఆవిష్కరించడంలో కృష్ణవంశీ సిద్దహస్తుడు. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. ప్రేక్షకులు మరో 50 ఏళ్ళ పాటు గుర్తుంచుకునే సినిమా ఇది అని దర్శకనిర్మాతలు తొలి నుండి చెప్తున్న మాట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇటివల ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో కొన్ని సన్నివేశాలను మెగాస్టార్ చిరంజీవి చూశారని సమాచారం. కృష్ణవంశీ సినిమా తెరకెక్కించిన విధానంతో చాలా సంతోషంగా ఉన్నారు చిరు. ముఖ్యంగా కుటుంబం మధ్య జరిగే సెంటిమెంట్ సన్నివేశాలు చూసి చిరంజీవి ఎమోషనల్ అయ్యారని సమాచారం. కంటతడి పెట్టారట. ‘గోవిందుడు అందరివాడేలే’తో కృష్ణవంశి మరోసారి మార్క్ చూపిస్తారని చిత్రబృందం చెప్తుంది.
రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీని కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఆడియో, అక్టోబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.