
‘ఉయ్యాల జంపాల’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన యువహీరో రాజ్ తరుణ్, తన రెండో సినిమా కోసం ఎన్నో కథలు విని చివరకు ‘సినిమా చూపిస్త మావ’ అంటూ ఇప్పటికి రెండో సినిమాను సిద్ధం చేశారు. ‘ఉయ్యాల జంపాల’ లాంటి అందమైన ప్రేమకథలో ఒదిగిపోయిన రాజ్ తరుణ్ – అవికా గోర్ జంట సినిమా చూపిస్త మావతో మరోసారి మెప్పించేందుకు సిద్ధమయ్యారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 14న విడుదలకు సిద్ధమైంది.
ఇక ట్రైలర్, పోస్టర్స్ ద్వారానే మంచి ఇంప్రెషన్ కలిగించిన ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయ్! అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించి అన్ని ప్రాంతాల బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోందని సమాచారం.ఇప్పటికే చాలా ప్రాంతాల బిజినెస్ మంచి ధరకు జరగడం విశేషంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా సాటిలైట్ రైట్స్ కూడా అప్పుడే అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ టీవీ చానల్ ఈ సినిమా సాటిలైట్ రైట్స్‌ను మంచి ధరకు సొంతం చేసుకుందట. ఇక విడుదలకు ముందే బిజినెస్ వర్గాల్లో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర్నుంచి కూడా అదే స్థాయి పాజిటివ్ రిపోర్ట్ తెచ్చుకుంటుందని సినిమా యూనిట్ భావిస్తోంది.

