తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తన లాస్ట్ మూవీ ‘జన నాయకుడు’(Jana Nayakudu) ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమా తెలుగులో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్ అని స్పష్టంగా అర్థమవుతోంది. తమిళ ప్రేక్షకులకు, అలాగే విజయ్ రాజకీయ ప్రవేశానికి సరిపోయేలా కథలో కొన్ని మార్పులు చేశారు. జన నాయకుడు చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో అనిరుధ్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లపై చర్చ మొదలైంది.
భగవంత్ కేసరి సినిమాకు థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద హైలైట్‌గా నిలిచింది. అనిరుధ్ స్కోర్ బాగానే ఉన్నా, భగవంత్ కేసరిలో థమన్ ఇచ్చిన స్కోర్ ఇంకా బలంగా ఉందని సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయపడుతున్నారు. తమిళంలో అనిరుధ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే, తెలుగులో పెద్ద సినిమాలకు థమన్ ఫస్ట్ ఛాయిస్. దీంతో భగవంత్ కేసరి బీజీఎంతో పోలిస్తే జన నాయకుడు కాస్త తక్కువగానే ఉందని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కొందరు బాలకృష్ణ, విజయ్ నటనను కూడా పోల్చడం మొదలుపెట్టారు. మొత్తానికి జన నాయకుడు విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు వచ్చిన సరైన సినిమా అనిపిస్తోంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
