‘మా’ ఎన్నికల ఫలితాలకు లైన్‌క్లియర్!

jayasudha-and-rajendra-pras
ఏప్రిల్ 15న వచ్చే కోర్టు తీర్పుతో ‘మా’ ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత వస్తుందనుకున్నవారికి ఇది శుభవార్తే! మా ఎన్నికల ఫలితాల విడుదలకు కోర్టు లైన్ క్లియర్ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ‘మా’ అసోసియేషన్‌కు ఎన్నికలు ఎక్కువ సార్లు ఏకగ్రీవంగానే జరిగాయి. గత రెండు దఫాలుగా మా అధ్యక్ష పదవిలో ప్రస్తుత ఎంపీ మురళీ మోహన్ కొనసాగుతున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆయన మళ్ళీ ఈ పదవిని చేపట్టే ఆలోచన చేయలేదు. ఆ క్రమంలోనే 2015-17 దఫాకు రాజేంద్రపసాద్ పోటీలో నిలబడ్డారు. మొదట ఏకగ్రీవంగా రాజేంద్రుడే గెలుస్తారని భావించినా చివర్లో ప్రముఖ నటి జయసుధ కూడా రంగంలోకి దిగడంతో పోటీ తప్పనిసరైంది.

ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, సవాళ్ళు విసురుకోవడంతో ఈ ఎన్నికల తంతు సామాన్యుడికీ హాట్ టాపిక్‌గా మారింది. ఇక మార్చి 29న ఈ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే ఎన్నికలు ముగిసి ఇన్ని రోజులైనా దీనికి సంబంధించిన కేసొకటి కోర్టు పరిధిలో ఉన్నందున ఫలితాలు వెలువడలేదు. అప్పట్లో ‘మా’ ఎన్నికలను నిలిపివేయాలని ఓ కళ్యాణ్ అనే వ్యక్తి కోర్టులో వేసిన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, ఎన్నికల నిర్వహణను నిలిపివేయడాన్ని తోసిపుచ్చింది. అయితే.. కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకూ ఫలితాలు ప్రకటించకూడదని తెలిపింది. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన విచారణకు ఈరోజుతో తెరపడింది. కేసును సమగ్రంగా పరిశీలించిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్ వేసినందుకు గాను పిటిషనర్‌పై పది వేల జరిమానా కూడా విధించింది.

కోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక మా ఎన్నికల ఫలితాలు విడుదల కావడమే ఆలస్యం. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇక నేడో, రేపో మా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత సమాచారం మేరకు ఏప్రిల్ 17న ఫలితాలను విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫలితాల్లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఉత్కంఠ రేపుతున్న అంశం.

Exit mobile version