
ఆస్కార్స్… హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులందరికీ పరిచయమున్న అవార్డ్స్. ప్రతీ ఏడాదీ ఉత్తమ ప్రతిభ కనబరిచే హాలీవుడ్ సినిమాలతో పాటు ఇతర ఫారిన్ లాంగ్వేజీ సినిమాలకు పలు క్యాటగిరిల్లో ఆస్కార్స్, అవార్డులను ప్రకటిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. 2016లో జరగనున్న ఆస్కార్ 88వ అవార్డుల కోసం పర భాషా సినిమాల క్యాటగిరీలో ఇప్పటికే పలు దేశాల నుంచి ఎంట్రీలు రాగా, ఇండియా తరపున ఈ ఏడాదికి ఓ మరాఠీ సినిమాను ఎంపిక చేశారు.
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరాఠీ సినిమా ‘కోర్ట్’ను ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్‌కు పంపించనున్నారు. మొత్తం 30 సినిమాలను పరిశీలించిన మీదట, జ్యూరీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్‌లో కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యూరీ ఈ విషయాన్ని ప్రకటించింది. మన తెలుగు సినిమా నుంచి ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ సినిమాలు పరిశీలనకు వచ్చాయి.
ఇక విజువల్ వండర్ అనిపించుకున్న బాహుబలి సినిమా ఆస్కార్‌కు ఇండియా తరపున ఎంట్రీగా నిలుస్తుందని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాగా అన్నీ పరిశీలించిన మీదట జ్యూరీ కోర్ట్ సినిమాను ఎంపిక చేసింది. చైతన్య తమాని కోర్ట్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సత్తా చాటిన ఈ సినిమా ఆస్కార్ వద్ద కూడా అదే స్థాయి సత్తా చాటాలని కోరుకుందాం.