న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise)చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని తొలుత మార్చి 26, 2026న విడుదల చేయాలని భావించినా షూటింగ్ ఆలస్యం కారణంగా ఇప్పుడు ఆగస్టు 21, 2026కి వాయిదా పడింది.
ఇక ఈ మూవీ రిలీజ్ ఆలస్యమవడంతో నిరాశలో ఉన్న అభిమానులను ఉత్సాహపరిచేందుకు చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘ఆయా షేర్’ను ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఈ పాటపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ నిర్మిస్తోంది.
