‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సంయుక్తంగా విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాటను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకుడు క్రిష్, గీత రచయిత చంద్రబోస్ తమ చిత్ర పాటకు మద్దతుగా నిలవడం ఆనందంగా ఉందని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట పేర్కొన్నారు. కథానుగుణంగా వచ్చిన ఈ గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆయన తెలిపారు.
మూవింగ్ డ్రీమ్స్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహావీర్ యేలెంధర్ సంగీతం అందించగా, సాయి చరణ్ ఆలపించారు. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ, సాయిబాబు తలారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రంలో నటరాజ, సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, వరుణ్ సందేశ్, వితిక షేరు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
