మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ, ‘రంగస్థలం’ తర్వాత ఐదు విభిన్నమైన పాటలు రాసే పూర్తి సంతృప్తి ఈ సినిమాతోనే దక్కిందని తెలిపారు. కథలోని కీలక మలుపుల ఆధారంగా పాటలు ఉంటాయని, నటి వితిక పాత్ర కథకు ప్రధాన బలమని పేర్కొన్నారు. వితికా షేరు మాట్లాడుతూ, చాలా రోజుల విరామం తర్వాత నటనకు ఆస్కారమున్న బలమైన పాత్ర దక్కడంతోనే ఈ ప్రాజెక్ట్ చేశానని స్పష్టం చేశారు.
దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ, నిర్మాత ఇచ్చిన సహకారంతో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేశామని, రాజకీయ అంశాలతో పాటు మంచి భావోద్వేగాలు చిత్రంలో ఉంటాయని తెలిపారు. సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మహావీర్ ఏలేందర్ సంగీతం అందించారు.
