నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. గత మూడు రోజులుగా బాలయ్య, అంజలి అండ్ టీం నైట్ టైం మొత్తం షూట్ చేసి నైట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను ఫినిష్ చేసేసారు. నైట్ షూట్ సీన్స్ పూర్తవడంతో ఈ రోజు మొత్తం గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం రేపటి నుంచి మరో ఫ్రెష్ షెడ్యూల్ ని హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టనున్నారు. ఇప్పటి వరకూ డిక్టేటర్ సినిమా 75% షూట్ ని ఫినిష్ చేసుకుంది.
అలాగే బాలయ్య ఈ సినిమాని డిసెంబర్ మిడిల్ కల్లా మొత్తం పూర్తి చేసి అనుకున్నట్టుగానే 2016 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి శ్రీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.
