ఒక సినిమా విజయంలో మ్యూజిక్ పాత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ మ్యాజిక్ వెనుక ఎంతోమంది రాత్రింబవళ్లు పడే కష్టం దాగి ఉంటుంది. తాజాగా ‘ధురంధర్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ (శా) డెడికేషన్ గురించి డైరెక్టర్ ఆదిత్య ధర్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా, శాశ్వత్‌ను తన సొంత తమ్ముడిగా భావిస్తానని ఆదిత్య తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ధురంధర్ సినిమా మ్యూజిక్ వర్క్ గురించి ఆయన చెప్పిన విషయాలు సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా ఒక సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికే నెలల సమయం పడుతుంది. కానీ శాశ్వత్ ఏకంగా రికార్డు సృష్టించారు. ధురంధర్ పార్ట్ 1 కోసం కేవలం 9 రోజుల్లో 9 పాటలు పూర్తి చేయడంతో పాటు, 6 రోజుల్లో మొత్తం బీజీఎమ్ (BGM) కంపోజ్ చేశారు. ఇక ధురంధర్ పార్ట్ 2 విషయానికి వస్తే ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 11 రోజుల్లో ఏకంగా 14 పాటలు, కేవలం 3 రోజుల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి చేశారు. ఈ వేగం, ఎమోషనల్ డెప్త్, క్వాలిటీ చూస్తుంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదని ఆదిత్య ధర్ పేర్కొన్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలో విడుదలైన ఈ రెండు ఆల్బమ్స్ గ్లోబల్ చార్ట్స్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవ్వడం మామూలు విషయం కాదని ప్రశంసించారు.
ఇల్లే స్టూడియోగా మారిపోయింది..
ఈ అద్భుతమైన మ్యూజిక్ వెనుక జరిగిన కష్టాన్ని ఆదిత్య కళ్లకు కట్టినట్లు వివరించారు. దాదాపు 15 రోజుల పాటు తన ఇల్లు ఒక ఇల్లుగా కాకుండా లివింగ్ స్టూడియోగా మారిపోయిందని ఆయన తెలిపారు. హాల్లో మ్యూజిక్, బెడ్రూమ్స్లో రికార్డింగ్, బాల్కనీల్లో రైటింగ్.. ఇలా ప్రతి గదిలో ఏదో ఒక పని జరుగుతూనే ఉండేది. సింగర్స్, మ్యూజీషియన్స్ రోజంతా వస్తూ పోతూనే ఉండేవారు. రోజుకు 21 నుంచి 22 గంటల పాటు నిద్ర లేకుండా పనిచేశామని, పగలు రాత్రి అనే తేడా లేకుండా అందరం ఒకే లక్ష్యంతో పనిచేశామని ఆదిత్య గుర్తుచేసుకున్నారు.
ఈ ప్రయాణంలో శాశ్వత్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని, సరిగ్గా నిద్రపోకుండా ఇబ్బంది పడినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదని ఆదిత్య ఎమోషనల్ అయ్యారు. లెజెండరీ లిరిసిస్ట్ ఇర్షాద్ కామిల్ సర్ సపోర్ట్, అలాగే శాశ్వత్ భాగస్వామి ‘మ్యాజిక్’ ఇచ్చిన ఎనర్జీ మమ్మల్ని ముందుకు నడిపించాయని ఆయన రాసుకొచ్చారు. శాశ్వత్ టాలెంట్‌ను మించి అతనికున్న ఆకలి, కసి తనను ఎంతో ఆకట్టుకున్నాయని డైరెక్టర్ తెలిపారు. మ్యూజిక్ ద్వారా దేవుడిని చేరుకోవాలనే అతని ప్రేమ ధురంధర్ సినిమాలోని ప్రతి సెకనులోనూ మీకు వినిపిస్తుందని ఆదిత్య ధర్ ముగించారు.
