ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సెలెబ్రేషన్స్ ఒకరోజు ముందుగానే మొదలయ్యాయి. AA22xA6 ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ అట్లీ టీమ్ వదిలిన క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఒక తోడేలును పోలిన జంతువు చేయి కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో చీకటి ఆకాశం కింద ఒక కోట మసకగా కనిపిస్తోంది. ఈ ఇంటెన్సివ్ పోస్టర్ చూస్తుంటే ఏదో భయంకరమైన కథాంశంతో అట్లీ ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తుండగా, మేకర్స్ ఈ సినిమాను 2027 వేసవిలో విడుదల చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. పోస్టర్‌లోని ఎలిమెంట్స్‌ను బట్టి ఇది ఒక సూపర్ నేచురల్ లేదా ఫాంటసీ యాక్షన్ డ్రామా అయి ఉంటుందని అభిమానులు విశ్లేషిస్తున్నారు. అల్లు అర్జున్‌ను అట్లీ ఏ రేంజ్ మాస్ లుక్‌లో చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, రేపు (ఏప్రిల్ 8) ఉదయం 11 గంటలకు ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా, టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం సోషల్ మీడియాలో ట్రెండ్స్ మొదలయ్యాయి. ఐకాన్ స్టార్ తన పుట్టినరోజున అభిమానులకు ఇచ్చే ఈ అసలైన ట్రీట్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
