ఇంటర్వ్యూ : దర్శకుడు ఎం.ఎస్.రాజు – ‘అగధ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..!

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 14న భారీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

‘అగధ’ అంటే ఏంటి?

‘అగధ’ అంటే లోతైన అంశం లేదా శూన్యం అని అర్థం. కంటికి కనిపించని దేవుడు, దెయ్యం లాంటి శక్తుల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. యూత్, మాస్ ఆడియెన్స్ ద్వారా ఓపెనింగ్స్ వస్తే, ఆ తర్వాత మౌత్ టాక్‌తో ఫ్యామిలీస్ థియేటర్లకు వస్తారు. కేవలం హారర్, భయపెట్టే అంశాలే కాకుండా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే ఓ దుష్ట శక్తినే ‘అగధ’గా చూపించాం.

‘అగధ’ చిత్రం విజయంపై భారీ నమ్మకంతో ఉన్నారు?

నేను ఇంతవరకు ఏ వేదికపైనా ఓ సినిమా బాగుందని ఇలా బహిరంగంగా చెప్పలేదు. కానీ ‘అగధ’ చూశాక ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది, అందుకే ఆ విషయాన్ని చెప్పా. థియేటర్లలో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటారని బలంగా నమ్ముతున్నా.

‘అగధ’ వీఎఫ్ఎక్స్ వర్క్ ఎలా ఉంటుంది?

నేను ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక ఫోకస్ పెడతాను, పూర్తి క్లారిటీ వస్తేనే ముందుకు వెళ్తాను. నేను తీసే ప్రతి సినిమాలో నా ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంది. నిర్మాతగా ఉన్నప్పుడు కూడా దర్శకులతో కథలపై చర్చించేవాడిని. ఇక టీజర్, ట్రైలర్లలోనే మా వీఎఫ్ఎక్స్ వర్క్ స్టాండర్డ్ ఏంటో అర్థమై ఉంటుంది, సినిమాలో అంతకు మించిన క్వాలిటీ చూడబోతున్నారు.

‘అగధ’ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పండి?

‘అగధ’ని మొదట ఎవరికీ ముందస్తుగా చూపించకూడదనుకున్నాం. కానీ ట్రైలర్ వచ్చాక హోంబలే ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధులు సినిమా చూశారు. ముందుగా తెలుగులో విడుదల చేశాకే మిగతా భాషల్లో డబ్బింగ్ వెర్షన్లను తెస్తాం. డబ్బింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. అలాగే 60 రోజుల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలనే నిబంధన పెట్టడంతో ప్రసార హక్కుల డీల్ ప్రస్తుతం హోల్డ్‌లోనే ఉంది.

ఇకపై దర్శకుడిగానే కంటిన్యూ అవుతారా? లేక సినిమాల్ని నిర్మిస్తారా?

ప్రస్తుతం నేను కథ, స్క్రీన్‌ప్లే, మేకింగ్ పైన మాత్రమే పూర్తి దృష్టి పెట్టాను. ఆర్థిక వ్యవహారాల జోలికి వెళ్లడం లేదు. ‘డర్టీ హరి’, ‘అగధ’ సినిమాలకి నా మిత్రులు ముందుకొచ్చి నిర్మాణ బాధ్యతలు చూసుకున్నారు. దాంతో నాపై ఆర్థిక భారం తగ్గి, కేవలం రైటింగ్, క్రియేటివ్ వర్క్ మీదే ఫోకస్ పెట్టే వీలు కలిగింది.

‘అగధ 2’ కథ రెడీగా ఉందా?

‘అగధ’ రిలీజ్ తర్వాతే ప్రీక్వెల్ తెస్తామా లేదా సీక్వెల్ చేస్తామా అనేది వెల్లడిస్తాను. ఆ స్కోప్ అయితే కథలో ఉంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక మిస్టిక్ డివైన్ థ్రిల్లర్.

Exit mobile version