తెలుగు నాటక రంగ దిగ్గజం, సీనియర్ నటుడు, రచయిత ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం గుంటూరు లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ, నాటక రంగంలో తీవ్ర విషాదం నెలకొంది.
పాఠశాల స్థాయి నుంచే నాటకాల వైపు అడుగులు వేసిన ఆయన, ఏకంగా 1,500కు పైగా నాటకాల్లో నటించి మెప్పించారు. పొన్నూరు కళాపరిషత్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కృష్ణేశ్వరరావు అనేక ప్రయోగాత్మక నాటకాలు రచించి, ఎన్నో నంది అవార్డులు అందుకున్నారు.
సీనియర్ నటుడు ఎం.ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో ‘ప్రచండ భారతం’ చిత్రానికి కథనందిస్తూ నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ, నాటక రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు.
