అడవి శేష్, మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దొంగాట’. మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మి స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం కానున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు లక్ష్మి హీరోయిన్ పాత్రలో కనిపించడం విశేషం. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
‘దొంగాట’ సినిమా రిలీజ్ విషయంలో మొదట్నుంచీ కొంత గందరగోళం కొనసాగుతూ వచ్చింది. మొదట్లో ఈ సినిమాను మే 1నే విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ‘గంగ’, ‘ఉత్తమ విలన్’ లాంటి రెండు భారీ క్రేజున్న సినిమాలు మే 1నే విడుదలకు సిద్ధమవడంతో ఈ సినిమాను వారం పాటు వాయిదా వేశారు. అయితే తాజాగా ‘ఉత్తమ విలన్’ విడుదల విషయంలో ఈరోజు ఉదయం ఏర్పడిన అయోమయంతో ‘దొంగాట’ సినిమా ఈ మధ్యాహ్నమే విడుదలవనుందనే వార్త హల్చల్ చేసింది. అయితే చివరకు మంచు లక్ష్మి సినిమా మే 8న విడుదలవనుందనే విషయాన్ని స్పష్టం చేశారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, ఆడియో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా మంచు లక్ష్మి పాడిన ‘యాందిరో..’ అనే పాటైతే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల్లో సైతం ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇన్ని అంచనాల మధ్య మే 8న విడుదలకు సిద్ధమైన ‘దొంగాట’ సినిమా బాలకృష్ణ ‘లయన్’తో పోటీ పడనుండడం విశేషం.
