‘కబాలి’ సినిమాను ‘భాషా’తో పోల్చొద్దు : రజనీ

kabali
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే బాక్సాఫీస్‌కు పండగే అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే రజనీ నటించిన గత రెండు చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. దీంతో తన కొత్త సినిమా కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న రజనీ.. ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ సినిమాలతో మెప్పించిన దర్శకుడు పా రంజిత్‌తో ‘కబాలి’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈనెల్లోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

ఇక ఈ సినిమా గురించి ఇప్పటివరకూ పెద్దగా ఎక్కడా ప్రస్తావించని రజనీ, ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయవేత్త అయిన ఆర్.ఎమ్.వీరప్పన్ జన్మదిన వేడుకల్లో కబాలి విశేషాలు పంచుకున్నారు. “కబాలి సినిమా అనౌన్స్ అయిన రోజునుంచే ఈ సినిమా భాషాను మించిపోయేలా ఉంటుందా? అని అందరూ అడుగుతున్నారు. భాషా సినిమాకు, కబాలికి సంబంధం ఉండదు. ఈ రెండు సినిమాలకు పోలిక తేవొద్దు. భాషా.. నా కెరీర్‌కి ఎప్పుడూ ఒక ప్రత్యేక సినిమా. అలాంటి సినిమా ఎప్పటికీ రాదు. అయితే ‘కబాలి’ సినిమా మాత్రం కచ్చితంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అని తెలిపారు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమాలో రజనీ ఓ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నారు. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించనున్నారు.

Exit mobile version