సువిక్షిత్, గీతికా రతన్ జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరిని’ అనేది ఉపశీర్షిక. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రియదర్శి, ‘రాజు వెడ్స్ రాంబాయ్’ దర్శకుడు సాయి కంపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “కొత్త సినిమాలను ప్రోత్సహించాలి. ఈ ట్రైలర్ చూడగానే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. నాడు దూరదర్శన్‌లో సినిమాలు చూసే నేను నటుడిగా మారాను. ఈ ‘దూరదర్శని’ సినిమా ప్రేక్షకులకు ‘సమీప దర్శని’గా మారి గొప్ప విజయం సాధించాలి” అని ఆకాంక్షించారు. 90వ దశకంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఈ టైటిల్ కనెక్ట్ అవుతుందని దర్శకుడు సాయి కంపాటి అన్నారు.
జెమిని సురేష్ మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రతి పాత్ర ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుందన్నారు. సినిమా విడుదల తర్వాత ఎమోషన్ అందరి హృదయాలను హత్తుకుంటుందని, ఇందులో నటీనటుల ప్రతిభ హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు కార్తీకేయ కొమ్మి తెలిపారు. ఎటువంటి అసభ్యత లేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం, ప్రతి ఒక్కరికీ తమ సొంతూరిలో విహరించిన అనుభూతిని ఇస్తుందని, పెట్టిన డబ్బుకు కచ్చితంగా న్యాయం చేస్తుందని హీరో సువిక్షిత్ నమ్మకం వ్యక్తం చేశారు.
