మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో, వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ ప్రాజెక్ట్ దుల్కర్ కెరీర్‌లో 40వ సినిమా కావడంతో విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి ప్రస్తుతం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
మెప్పించిన యాక్షన్.. నిరాశపరిచిన ద్వితీయార్ధం
ఈ చిత్రంలో ‘డాన్ జాన్’ అనే లక్కీ గ్యాంబ్లర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించారు. ప్రథమార్ధం ఆసక్తికరమైన ఫాంటసీ అంశాలు, వేగవంతమైన యాక్షన్ బ్లాక్స్‌తో సాగిపోతుంది. ముఖ్యంగా బార్ ఫైట్, ఇంటర్వెల్ యాక్షన్ సీన్లలో దుల్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. మిస్కిన్, ఆంటోనీ వర్గీస్, కాయదు లోహర్ తమ పాత్రల పరిధి మేరకు నటించగా, జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం పోరాట సన్నివేశాలకు ప్రధాన బలంగా నిలిచింది.
అయితే, ద్వితీయార్ధంలో కథనం నెమ్మదించడం, బలహీనమైన సంభాషణలు, ఎడిటింగ్ లోపాలు సినిమా వేగాన్ని దెబ్బతీశాయి. దుల్కర్ అభిమానులను ఆయన మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నప్పటికీ, రెగ్యులర్ ప్రేక్షకులను ఈ చిత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు షోలు రద్దు.. రాత్రికి ప్రారంభమయ్యే ఛాన్స్
మరోవైపు, తెలుగు వెర్షన్ ప్రదర్శనలకు సంబంధించి తొలిరోజు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మార్నింగ్, మ్యాట్నీ షోలను రద్దు చేయాల్సి వచ్చింది. సమస్యను పరిష్కరించి, నైట్ షోల నుంచి తెలుగు ప్రదర్శనలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
