
‘అష్టా చమ్మా’ సినిమా ద్వారా నటుడిగా పరిచయమై ఆ తర్వాత పలు సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన శ్రీనివాస్ అవసరాల ఇప్పుడు డైరెక్టర్ గా మారి తన డ్రీం సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా చేసే నిర్మాత కోసం తను రెండున్నర సంవత్సరం ఎదురు చూసాడు. ఎట్టకేలకు 14 సినిమాల్లో నటించిన తర్వాత అతని మెగా ఫోన్ పట్టుకునే అవకాశం దక్కింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నటుడిగానే కొనసాగుతా, ఎప్పుడన్నా తన మనసుకు నచ్చిన సబ్జెక్ట్ దొరికితే సినిమా చేస్తానంటున్న శ్రీని అవసరాల చెప్పిన మరిన్ని విశేషాలు మీ కోసం..
ప్రశ్న) మీరు రాసుకున్న స్క్రిప్ట్ పాతది కాదా.?
స) ఈ సినిమా స్క్రీన్ ప్లే ని ఫ్రెంచ్ ప్లే సిరన్నో డే బెర్జెరెక్ నుంచి స్ఫూర్తి పొంది తీసుకున్నాం. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని మేజర్ పాయింట్ ని ఈ ఫ్రెంచ్ ప్లే నుంచే తీసుకున్నాం. ఈ సినిమాకి హీరోయిన్ చాలా కీలకం. అలాగే సినిమాలో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్, స్కిన్ షో, నాశిరకమైన కామెడీని కాకుండా అందరూ హాయిగా నవ్వుకునే కామెడీని రాసుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. ఈ సినిమాకి స్క్రిప్ట్ ని రెండు సంవత్సరాల క్రితమే రాసుకున్నాను. అప్పటి నుంచి ఆ స్క్రిప్ట్ ని ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నాను.
ప్రశ్న) ఈ సినిమాపై మీ నిర్మాత నమ్మకంగా ఉన్నాడా?
స) ఆ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడలేను.. నేను కథ చెప్పినప్పుడు మా నిర్మాత ఓకే అన్నాడు కానీ ఆయనికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సినిమా మొదలు పెట్టిన 15 రోజుల తర్వాత షూటింగ్ చాలా సాఫీగా సాగుతూ, బడ్జెట్ అంతా కంట్రోల్ లోనే ఉండడం వలన అప్పుడు ఆయనకి నమ్మకం వచ్చింది. నేను కథ రాసుకున్నప్పుడు కొంతమంది నటీనటుల్ని అకున్నాను కానీ ఆ తర్వాత ఇలాంటి లవ్ స్టొరీకి కొత్త నటీనటులైతే బాగుంటుంది అనిపించి కొత్త వాళ్ళని తీసుకున్నాం. ఈ మూవీ లోని నటీనటుల నటనే ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. అలాగే నేను ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారా అని ఎదురు చూస్తున్నాను.
ప్రశ్న) ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పండి.?
స) ఇది యాక్షన్ సినిమా కాదు, ఇదొక సున్నితమైన ప్రేమకథ. నేను ఎప్పుడైతే ఓ కథ రాయాలి అనుకుంటానో అప్పడు కొన్ని సందర్భాల్లో నా పాత్ర అనేది ఇన్వాల్వ్ అయిపోతుంది. నీకు మెలోడ్రామాలు, సెంటిమెంట్ లాంటివి నచ్చవు, నేను ఎప్పుడు కథ రాసుకున్నా వీటిని దూరంగా ఉంచుతాను. నేను ఇంకా నటించాలనుకుంటున్నాను. ప్రస్తుతం కూడా రెండు సినిమాలు చేస్తున్నాను. ఎప్పుడైతే నాదగ్గర స్క్రిప్ట్ రెడీ గా ఉంటుందో మరియు ఎప్పుడైతే నేను ఏదన్నా ఒక కథ చెప్పాలనుకుంటానో అప్పుడే డైరెక్ట్ చేస్తాను. నాకు టెక్నికల్ గా డబ్బింగ్, డిటిఎస్, మిక్సింగ్ లాంటివి తెలియదు. నేను నా ప్రోడక్ట్ ని ఇష్టపడతాను అంతే కానీ అదే ఎక్కువ లేదా అదే బెస్ట్ అని ఫీలవ్వను. ఒక్కసారి పని ముగించుకొని ఇంటికి వెళితే పొద్దున్న వరకూ హాయిగా నిద్రపోతాను.