ప్రత్యేక ఇంటర్వ్యూ : కళ్యాణి కోడూరి – జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని సందర్భమిది!

kaluani-koduri
కళ్యాణ్ కోడూరి లేదా కళ్యాణి మాలిక్.. ఈ రెండింట్లో ఏ పేరుతో పిలుచుకున్నా ముందు గుర్తొచ్చేది తియ్యగా మనసుకు హత్తుకునే ఆయన సంగీతమే! 2003లో ‘ఐతే’ దగ్గర్నుంచి మొదలైన ఈ సంగీత ప్రయాణం నేటికీ అదే పంథాలో కొనసాగుతోంది. ఇక ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సంగీత ప్రియులను ఇప్పటికీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగిన ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’లో ఈ సినిమా దాదాపు అన్ని విభాగాల్లోనూ అవార్డు సొంతం చేసుకొని ప్రత్యేకత చాటుకుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరితో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) కంగ్రాట్స్. ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌’లో మ్యూజికల్ అవార్డ్స్ అన్నీ మీకే వచ్చాయి కదా. ఎలా ఉంది?

స) చాలా సంతోషంగా ఉంది. నేనైతే నా ఎగ్జైట్‌మెంట్‌ను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా జీవితంలో ఇదే బిగ్గెస్ట్ మూమెంట్. ఏ కళాకారుడికైనా అవార్డు తీసుకునేప్పుడు వచ్చే ఉద్వేగం మాటల్లో చెప్పలేనిది. జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని సందర్భమిది!

ప్రశ్న) మీ సినిమా ఇలా ఇన్ని అవార్డులు సొంతం చేసుకుంటుందని ముందే ఊహించారా?

స) లేదు. ఏదో ఒకటీ రెండు అవార్డులు వస్తాయని అనుకున్నాను కానీ ఇలా మ్యూజికల్ అవార్డ్స్ అన్నీ వస్తాయని ఊహించనే లేదు. ఇప్పటివరకూ నేను పడ్డ కష్టం, సినిమాపై చూపించిన అభిమానం ఇప్పుడీ అవార్డు ద్వారా బ్యాలెన్స్ అయ్యాయనుకుంటున్నా. ఈ అవార్డులతో ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు వచ్చిందని భావిస్తున్నా.

ప్రశ్న) ఈ అవార్డులనే వాటిని మీరు ప్రత్యేక గుర్తింపుగా చూస్తారా?

స) కచ్చితంగా. నేను ఇండస్ట్రీకొచ్చి చాలా కాలమైంది. ఇప్పటివరకూ నా కెరీర్లో 80% సక్సెస్ రేట్ కూడా ఉంది. నా పాటలు సినిమాకు మంచి మూడ్‌ను తెచ్చాయని ప్రశంసించిన వారూ ఉన్నారు. అయినా ఎప్పుడూ నేను ఏ అవార్డూ సాధించింది లేదు. అవార్డు ఫంక్షన్స్ జరిగినప్పుడల్లా నా పేరక్కడ లేదే అన్న నిరాశ వెంటాడుతూ ఉండేది. ఇప్పుడీ ఈ అవార్డు ద్వారా మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చింది. నా పాటలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే అందరూ నా దాకా వచ్చి చెప్పేవారుండకపోవచ్చు. అలాంటప్పుడు నాలాంటి వాళ్ళకు ఎనర్జీనిచ్చేది ఈ అవార్డులే!

ప్రశ్న) కీరవాణి, రాజమౌళి లాంటి వారికి సోదరుడిగా ఉండి కూడా వాళ్ళ బ్రాండ్‌ను ఎప్పుడూ ఉపయోగించుకున్నట్లు కనిపించలేదు. ఎందుకని?

స) నా అవకాశాల కోసం రాజమౌళి, కీరవాణిల పేరు వాడుకోవడం అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. నేను ఇంతకుముందు చేసిన సినిమాలు, నా టాలెంటే నాకు అవకాశాలు తెచ్చిపెట్టాలనే అభిప్రాయం నాది. ఇక అదలా ఉంచితే నాకు మొదట్నుంచీ బిడియం ఎక్కువ. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడమనేది అస్సలు తెలీదు.

ప్రశ్న) మీ అన్నయ్య కీరవాణి దగ్గర్నుంచి ఎలాంటి ప్రేరణ పొందారు?

స) అన్నయ్య దగ్గర నేను ఎనిమిదేళ్ళ పాటు అసిస్టెంట్‌గా పనిచేశా. ఆ సమయంలో ఆయన దగ్గర్నుంచి చాలానే నేర్చుకున్నా. ముఖ్యంగా పని పట్ల ఆయన చూపే శ్రద్ధ, కష్టపడే విధానం నాకు బాగా నచ్చుతాయి.

ప్రశ్న) అన్ని అవార్డుల్లోకెల్లా మీకు బాగా సంతృప్తినిచ్చిన అవార్డ్ ఏది?

స) కచ్చితంగా బెస్ట్ కంపోజర్‌గా వచ్చిన అవార్డే ఎక్కువ సంతృప్తినిచ్చిందని చెబుతా! మనం కంపోజ్ చేసిన పాటకు అవార్డు వచ్చినప్పుడుండే ఆనందం వేరు. ఇక ఈ అవార్డును మహేష్ బాబు చేతుల మీదుగా అందుకోవడం ఇంకా సంతోషానిచ్చే విషయం. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడంతో ఆ విలువ మరింత పెరిగిందనిపించింది.

ప్రశ్న) ఈ అవార్డు విషయంలో ‘ఊహలు గుసగుసలాడే’ దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. మీరేమంటారు?

స) కచ్చితంగా! ఈ పాటలు ఇంత అందంగా రావాలంటే అందుకు తగ్గ సరైన సందర్భాలు సినిమాలో ఉండాలి. పాటల పిక్చరైజేషన్ కూడా అంతే అందంగా ఉండడంతో ఈ సినిమాలో పాటలన్నీ మనసుకు హత్తుకుంటాయి. మ్యూజిక్ విషయంలో ఇంత మంచి టేస్ట్ ఉన్న శ్రీనివాస్‌కు ఈ అవార్డుల్లో చాలా క్రెడిట్ దక్కుతుంది.

ప్రశ్న) ఇప్పటివరకూ మీరు చేసిన సినిమాలు చూస్తే చాలా తక్కువే కనిపిస్తాయి. ఎందుకంత తక్కువ సినిమాలు ఎంచుకుంటున్నారు?

స) నేను పర్టిక్యులర్‌గా ఈ సినిమాలే ఎంచుకుంటున్నాననేది నిజం కాదు. చెప్పాలంటే.. ‘అష్టా చమ్మా’, ‘అలా మొదలైంది’ లాంటి సినిమాల తర్వాత కొన్నాళ్ళు ఏ అవకాశమూ రాలేదు. నాకొచ్చిన అవకాశాలనే చేసుకుంటూ పోయా. నేను ఇప్పటివరకూ చేసిన సినిమాల ఔట్‌పుట్ చూసుకుంటే చాలా సంతృప్తిగా కూడా ఉంది. ఈ సినిమాలతో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది అదే గుర్తింపు మరిన్ని ఆసక్తికర అవకాశాలను తెచ్చిపెడుతుందని కోరుకుంటున్నా.

ప్రశ్న) ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు?

స) డైరెక్టర్ తేజ గారి ‘హోరా హోరీ’కి నేనే మ్యూజిక్ కంపోజ్ చేశా. ప్రస్తుతం నందిని రెడ్డి సినిమా, వారాహి సంస్థ నిర్మించే మరో కొత్త సినిమాలకు పనిచేస్తున్నా.

ప్రశ్న) ‘బాహుబలి’ సినిమాకు మీరు నిర్వహించిన బాధ్యతల గురించి చెప్పండి?

స) గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలకు నేను సౌండ్ మిక్సింగ్ బాధ్యతలు నిర్వహించా. ‘బాహుబలి’కి డాల్బీ అట్మాస్ అనే సౌండ్ సిస్టమ్‌ను ఉపయోగించాలనే ఆలోచనలో రాజమౌళి ముంబైలో టెక్నాలజీ గురించి పరిశోధించాడు. అప్పుడే కొంత భాగం మిక్సింగ్ చూసిన రాజమౌళి, ఔట్‌పుట్ చూసి సంతృప్తి చెందలేదు. అదే సమయంలో నన్ను పిలిచి మిక్సింగ్ బాధ్యతలు అప్పజెప్పారు. నెలరోజులు కష్టపడి ఈ సినిమాకు మిక్సింగ్ పనులు పూర్తి చేశా.

ప్రశ్న) ‘బాహుబలి’లో మీ వర్క్‌కు రాజమౌళి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?

స) మొదట్లో సౌండ్ మిక్సింగ్ పనులు కొన్ని పూర్తయ్యాక.. నేను, కీరవాణి, రాజమౌళి ముంబైలోని ఓ థియేటర్లో కొన్ని సన్నివేశాలు చూశాం. అప్పుడే మాకో నమ్మకం వచ్చింది. ఇక మొత్తం ఔట్‌పుట్ చూశాక రాజమౌళి నన్ను గట్టిగా కౌగిలించుకొని, “నా రెండున్నరేళ్ళ కష్టాన్ని నీ సౌండ్ మిక్సింగ్‌తో మరింత అందంగా తీర్చిదిద్దావ్” అన్నాడు. నాకొచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అది.

ప్రశ్న) ఇప్పటివరకూ మీరు ఎక్కువగా సాఫ్ట్ మ్యూజిక్ ఉన్న పాటలనే ఇచ్చారు. మాస్ సినిమాలకు కంపోజ్ చేసే ఆలోచన లేదా?

స) నిజానికి, నేను ఎలాంటి సినిమా చేయడానికైనా సిద్ధమే! గతంలో నేను ఓ రెండు సినిమాలకు మాస్ నంబర్లు కూడా ఇచ్చా. అయితే ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అవి మరుగున పడిపోయాయ్! ఇక నాకు గుర్తింపు తెచ్చింది కూడా సాఫ్ట్ మ్యూజికే కావడంతో ఎక్కువగా అలాంటి అవకాశాలే వస్తున్నాయి.

ప్రశ్న) మీ పేరును కళ్యాణి మాలిక్ నుండి కళ్యాణి కోడూరిగా మార్చుకున్నారు. ఏదైనా కారణమా?

స) కారణమంటే.. కొన్ని పర్సనల్ కారణాలున్నాయి. అయితే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ లాంటి వాటిని పట్టుకొనైతే పేరు మార్చుకోలేదు. నేను పేరు మార్చుకోకముందూ మంచి హిట్స్ ఇచ్చా, పేరు మారాక కూడా హిట్స్ ఇచ్చా. ప్రత్యేకించి సక్సెస్ కోణంలో పేరును మార్చడమైతే జరగలేదు.

ప్రశ్న) ప్రస్తుతమున్న జనరేషన్‌లో మీకు బాగా ఇష్టమైన కంపోజర్ ఎవరు?

స) థమన్ వర్క్ అంటే ఇష్టం. ప్రోగ్రామింగ్‌లో మంచి ప్రయోగాలు చేస్తాడు. మిక్కీ జే మేయర్, రాధా కృష్ణల సంగీతాన్ని కూడా బాగా ఇష్టపడతా!

ప్రశ్న) ‘ఈ దర్శకుడితో ఒక్కసారైనా పనిచేయాలి’ అనిపించే వారెవరైనా ఉన్నారా?

స) త్రివిక్రమ్, సుకుమార్, చంద్రశేఖర్ ఏలేటి లాంటి దర్శకులతో పనిచేయాలని ఉంటుంది. వాళ్ళ ఆలోచనా విధానం నాకు బాగా నచ్చుతుంది.

ప్రశ్న) చివరగా, ప్రేక్షకులకు, మీ శ్రోతలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?

స) నన్ను, నా పాటలను మొదట్నుంచీ ఆదరిస్తూ వస్తోన్న వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వాళ్ళే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. నాకు అండగా నిలబడ్డ వారికి పేరుపేరునా ధన్యవాదాలు.

ఇక అక్కడితో సంగీత దర్శకుడు కళ్యాణి కోడూరితో ఇంటర్వ్యూ ముగించాం. భవిష్యత్‌లో ఆయన ఇలాంటి ఎన్నో మంచి సినిమాలకు సంగీతం అందించి మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలని ఆల్ ది బెస్ట్ తెలిపి సెలవు తీసుకున్నాం.

Exit mobile version