
‘కొరియర్ బాయ్ కళ్యాణ్’.. వరుస హిట్స్‌తో జోరు మీదున్న నితిన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణంలో రూపొంది చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ఎదురుచూయించిన సినిమా. ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 17న) ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’తో దర్శకుడిగా పరిచయం కానున్న ప్రేమ్ సాయితో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ముందుగా మీ నేపథ్యమేంటి? సినిమాల్లోకి ఎలా వచ్చారు?
స) నేను తెలుగు వాడినే అయినా పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే! చిన్నప్పట్నుంచే సినిమాలంటే మంచి ఆసక్తి ఉండేది. ఆ క్రమంలోనే టెలివిజన్ ఇండస్ట్రీలో నటుడిగా 15 ఏళ్ళ పాటు పనిచేశా. ఇక ఆ తర్వాత ఇంకా క్రియేటివ్‌గా ఏదైనా చేయలనిపించింది. అప్పుడే ప్రభుదేవా గారిని కలవడం, ఆయనకు నా ఆలోచన విధానం నచ్చడంతో కొన్నేళ్ళు ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. దర్శకత్వంపై నాకంటూ ఒక అవగాహన వచ్చాక సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టా. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అనే సినిమా మొదలైంది.
ప్రశ్న) కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా ఎలా మొదలైంది?
స) దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టి కొత్తలోనే గౌతమ్ మీనన్ గారిని కలిసే అవకాశం దక్కింది. ఆయనకు నేను ఈ కొరియర్ బాయ్ కళ్యాణ్ కథ చెప్పిన వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యారు. జై హీరోగా తమిళంలో ఈ సినిమాను చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అప్పుడే గౌతమ్ మీనన్ గారే తెలుగులో కూడా ఒకేసారి చేసేస్తే ఈ సినిమాకు మంచి మార్కెట్ ఉంటుందని తెలుగు వర్షన్‌ను కూడా ప్లాన్ చేశారు. గౌతమ్ మీనన్ గారే నితిన్ ఈ సినిమా తెలుగు వర్షన్‌కు బెస్ట్ అనుకున్నారు. అలా ఒకే భాషలో మొదలుపెట్టిన సినిమా ఇప్పుడు రెండు భాషల్లో రిలీజ్‌కు సిద్ధమైంది.
ప్రశ్న) ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమా ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు?
స) నాకు సాధారణ వ్యక్తుల కథలంటేనే ఇష్టం. వాళ్ళ జీవితాలు, వాళ్ళ కష్టాలు.. ఇలాంటి కథలను చెప్పాలనేదే నా అజెండా. ఈ సినిమా అదే కోవలో ఓ సాదాసీదా కొరియర్ బాయ్ జీవితంలో వచ్చిన అనుకోని మార్పులేంటి? అతడి జీవితం ఏమైంది? అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఓ ఆసక్తికర కథతో నడిచే డిఫరెంట్ సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు.
ప్రశ్న) దర్శకుడు గౌతమ్ మీనన్ సపోర్ట్ ఎలా ఉండేది?
స) గౌతమ్ మీనన్ గారు ఈ సినిమాకు, నాకు ఓ ఐడెంటిటీ. ఇంటిపేరుతో మనకు ఎలా ఓ ఐడెంటిటీ ఉంటుందో దర్శకుడిగా నా మొదటిసినిమాకు గౌతమ్ మీననే ఐడెంటిటీ! స్వతహాగా దర్శకుడైనా కూడా స్క్రిప్ట్ ఓకే అయ్యాక క్రియేటివ్ సైడ్ ఎక్కడా ఆయన ఇన్వాల్వ్ కాలేదు. పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. గౌతమ్ మీనన్ లేకపోతే ఈ సినిమా లేదు.
ప్రశ్న) హీరో నితిన్ గురించి చెప్పండి?
స) నితిన్‌ను నేను మొదటి సారి కలిసింది.. ఈ సినిమా కథ చెప్పే సమయంలోనే! నితిన్ అన్నివిధాలా మంచి సపోర్ట్ ఇస్తూ సినిమాకు ఓ పిల్లర్‌లా నిలబడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. నితిన్‌ను డైరెక్టర్స్ డార్లింగ్ అనొచ్చు. ఈ సినిమా విషయంలో ఆయనిచ్చిన సపోర్ట్‌ను మరచిపోలేను.
ప్రశ్న) హీరోయిన్ యామి గౌతమ్ గురించి చెప్పండి? ఈ పాత్రకు చాలా ప్రొఫైల్స్ పరిశీలించారట?
స) యామి గౌతమ్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ కాస్ట్ అని చెబ్తా. తెలుగు, తమిళం.. ఇలా రెండు వర్షన్స్కూ ఒకే హీరోయిన్ ఉండాలని ముందే ఫిక్స్ అయ్యాం. ఆ క్రమంలోనే చాలా ప్రొఫైల్స్ చూశాక యామి గౌతమ్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ అనిపించింది. యామి గౌతమ్ పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంది.
ప్రశ్న) సినిమా ఇంత లేట్ అవ్వడంతో ఎప్పుడైనా డిప్రెస్ అయ్యారా?
స) సినిమా లేట్ అయినా డిప్రెస్ అవ్వడం లాంటివి జరగలేదు. పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలకు సైతం ఇలాంటి సమస్యలు వచ్చిన రోజులున్నాయి. అన్నింటికీ నేను ముందే ప్రిపేర్ అయి ఉండడంతో టెన్షన్ పడలేదు. సినిమా కొత్తదనమున్నది కావడం, సినిమాపై మాకున్న నమ్మకంతో ఇంత లేట్ రిలీజ్ అవుతున్నా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంది.
ప్రశ్న) ఈ సినిమాలో ప్రేక్షకుడిని కట్టిపడేసే అంశమేదీ అంటే ఏం చెబుతారు?
స) సరికొత్త కథే ఈ సినిమాకు మేజర్ హైలైట్ అని చెబుతా. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, సాంగ్స్ అన్నీ ఉన్నాయి. అంతకు మించి ఓ సరికొత్త కథ ఉంది. ‘ప్రేక్షకులు కొత్తదనమున్న సినిమా తీస్తే అస్సలు చూడరు’ అన్న వ్యాఖ్యలు రోజూ వింటూంటాం. నన్నడిగితే ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనానికి స్వాగతం పలుకుతారు. మనమే ప్రేక్షకులు మారలేదు అన్న నెపంతో రొటీన్ సినిమాలు తీస్తున్నామేమో అనిపిస్తూంటుంది. ఇప్పుడు ప్రేక్షకులు మారిపోయారు. కొత్తదనమున్న సినిమాలను వారు కోరుకుంటున్న విషయం దర్శక నిర్మాతలు గుర్తించాలి.
ప్రశ్న) తదుపరి ప్రాజెక్టులు ఏంటి?
స) ఇంకా ఏదీ ఫిక్స్ చేయలేదు. నా దగ్గర కథలు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, తమిళంలో పలువురు హీరోలకు కథలు వినిపిస్తూనే ఉన్నా. ఇప్పుడే ఆ వివరాల గురించి చెప్పలేను. రేపు సినిమా విడుదలయ్యాక తరువాతి సినిమా ఏదనేది తెలియజేస్తా.