
‘యువసేన’, ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నటుడిగా పరిచయమై శర్వానంద్ అతి తక్కువ టైంలోనే టాలెంటెడ్ నటుడిగానే కాకుండా హీరోగా కూడా మంచి సినిమాలు చేసి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వానంద్ చివరి మూవీ ‘రన్ రాజా రన్’ మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేము కాసేపు శర్వానంద్ తో ప్రత్యేకంగా ముచ్చటించి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ గురించి తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ‘రన్ రాజా రన్’ లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత వస్తున్న ఈ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా ఎలా ఉండబోతుంది.?
స) చాలా రోజుల తర్వాత ఓ మంచి స్క్రిప్ట్ దొరికింది. ఈ సినిమాతో మేము ఓ ఫీల్ గుడ్ లవ్ స్టొరీని తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నాం. సినిమా మొదటి నుంచి చివరి వరకూ మంచి ఫీల్ తో సాగుతుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాయింట్ లో ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు.
ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.? అలాగే ఇందులో మీరు రన్నర్ గా కనిపిస్తున్నారు. దాని గురించి చెప్పండి.?
స) ఈ సినిమాలో నేను పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాను. చాలా సింపుల్ అండ్ సెటిల్ గా పెర్ఫార్మన్స్ ఉంటుంది. ఇక రన్నర్ విషయానికి వస్తే ట్రైలర్ చూసిన అందరూ ఇదొక స్పోర్ట్స్ ఫిల్మ్ అనుకుంటున్నారు. కానీ ఇది స్పోర్ట్స్ ఫిల్మ్ కాదు. మేము అనుకున్న లవ్ స్టొరీకి బ్యాక్ డ్రాప్ గా, లవ్ స్టొరీకి లింక్ లాగా ఈ రన్నర్ అనే కాన్సెప్ట్ ఉంటుందే తప్ప స్పోర్ట్స్ మీదనే సినిమా ఉండదు.
ప్రశ్న) క్రాంతి మాధవ్ చెప్పిన ఈ కథని ఓకే చెయ్యడానికి మేజర్ రీజన్ ఏమిటి.?
స) క్రాంతి మాధవ్ కథ చెప్పినప్పుడు ఇలాంటి లవ్ స్టొరీ ఒకటి ఉంటాదా.. నా వరకూ అయితే అస్సలు ఇలాంటి లవ్ స్టొరీ రియల్ లైఫ్ లో ఉండదనే చెప్తాను. ప్రతి జెనరేషన్ వారు ఈ సినిమాకి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యి అప్పట్లో మనం అలాగే ఉన్నాం కదా అనేలా సినిమా ఉంటుంది. ఇప్పటి యంగ్ జెనరేషన్ అయితే ఇలాంటి లవ్ స్టొరీ ఎక్కడా ఉండదనే చెప్తారు. అందుకే ఈ లవ్ స్టొరీ కొత్తగా అనిపించి చేసాను. సినిమా అంటే లేనిది చూపించడమే కదా(నవ్వులు)..
ప్రశ్న) మొదటి సినిమాతో విమర్శకుల మెప్పును మాత్రమే పొందిన క్రాంతి మాధవ్ ఈ సినిమాతో కమర్షియల్ గా ఎంత వరకూ సక్సెస్ అవుతాడు.?
స) నా పరంగా కమర్షియల్ అంటే సినిమా చూస్తున్నంత సేపూ ఆడియన్స్ ని ఏదో ఒక ఫీల్ కి కనెక్ట్ చెయ్యాలి. అది కామెడీ, యాక్షన్, లవ్ ఏదైనా కావచ్చు. ఆ పరంగా ఈ సినిమాలో మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీని కనెక్ట్ చేస్తాం. కచ్చితంగా క్రాంతి మాధవ్ కమర్షియల్ గా సక్సెస్ అవుతాడనే అనుకుంటున్నాం. ఫెంటాస్టిక్ డైరెక్టర్.. కథ చెప్పినప్పటి నుంచి ఫైనల్ అవుట్ పుట్ వరకూ అనుకున్నది అనుకున్నట్టు చేసాడు. హ్యాట్సాఫ్ టు క్రాంతి మాధవ్.
ప్రశ్న) నిత్యా మీనన్ తో రెండవసారి కలిసి పనిచేయడం ఎలా ఉంది.?
స) నిత్యా మీనన్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ తరం సావిత్రి నిత్యా మీనన్.. తనని చూస్తే సావిత్రి మళ్ళీ పుట్టారని అనిపిస్తుంది. స్వతహాగా నిత్యా చాలా టాలెంట్ ఉన్న హీరోయిన్. పక్కనే ఇలాంటి హీరోయిన్ ఉంటే మనకు పోటీగా నటించాలని అనిపిస్తుంది. తనతో రెండవ సినిమా కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే వెరీ ఈజీ టు ఫాల్ ఇన్ లవ్ విత్ నిత్యా(నవ్వులు..)..
ప్రశ్న) మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మేజర్ హైలైట్స్ ఏమిటి.?
స) ఈ సినిమా మేజర్ హైలైట్స్ లో ముగ్గురు గురించి చెప్పాలి.. క్రాంతి మాధవ్ డైలాగ్స్, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ మరియు గోపి సుందర్ రీ రికార్డింగ్ హైలైట్స్ అవుతాయి. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా చెయ్యడానికి డేర్ చేసిన కెఎస్ రామారావు గారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ సినిమాకి హైలైట్ అవుతాయి.
ప్రశ్న) మీ కెరీర్ లో కమర్షియల్ కన్నా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ చేసారు.? ఫెయిల్యూర్ అవుతున్నా అలాంటి కథలే ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి.?
స) ఇదీ కారణం అంటూ ఏమీ లేదండి.. నాకు స్వతహాగా డిఫరెంట్ స్టోరీలు చెప్పడం ఇష్టం.. ఒకటే ఫార్ములా సినిమాలు చేయడం అంటే ఇష్టం ఉండదు. ఒక డిఫరెంట్ స్టొరీని ప్రయోగాత్మకంగా చెప్పడం ఇష్టం. నా వరకూ రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేయడమే నా కంఫర్టబుల్ జోన్. ఇంకా చెప్పాలి అంటే ఎవరన్నా శర్వ ఇది చెయ్యలేడు అంటే అది చేసి చూపించాలి అనిపిస్తుంది.
ప్రశ్న) మీ ఫెయిల్యూర్స్ లో ఏ సినిమా మీలో ఎక్కువ మార్పును తీసుకు వచ్చింది.? మీ ప్రొడక్షన్ లో మళ్ళీ సినిమా ఎప్పుడు ఉంటుంది.?
స) ప్రతి ఫెయిల్యూర్ మనకు ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుంది. సక్సెస్ అయినప్పుడు కూడా ఎంతో నేర్చుకోవాలి. ఫెయిల్యూర్స్ లో నేను నిర్మించిన ‘కో అంటే కోటి’ సినిమా బిగ్గెస్ట్ లెసన్. అసలు ప్రొడక్షన్ అంటే ఏంటి, అందులో ఎందుకు వేలు పెట్టకూడదు అనేది తెలుసుకున్నాను. ప్రస్తుతానికైతే నా ప్రొడక్షన్ లో ఏం సినిమాల్లేవు. ఒకవేళ చేసినా అందులో నేను హీరోగా చెయ్యను.
ప్రశ్న) మాకు తెలియని శర్వానంద్ రియల్ లైఫ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు.?
స) రియల్ లైఫ్ లో అంటే… అందరూ అనుకున్నంత మంచి వాణ్ణి కాదు.. నేను చాలా ప్రైవేట్ పర్సన్. నా పనేదో నేను చేసుకుంటూ వెళ్తాను..
ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.? అలాగే రేపు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చూడాలనుకునే ప్రేక్షకులకు ఏం చెప్తారు.?
స) ప్రస్తుతం రెండు స్క్రిప్ట్ లని ఒకే చేసాను. ఆ ప్రాజెక్ట్స్ గురించి త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ వారు త్వరలోనే అనౌన్స్ చేస్తారు. ఇక మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే ఆడియన్స్ కి ఒకటే చెప్తాను.. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టొరీ చూడాలనుకునే వారు ఈ సినిమా చూడండి, మీకు కచ్చితంగా నచ్చుతుంది.
అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ మంచి సక్సెస్ అవ్వాలని శర్వానంద్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాము…