
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం గోవా బీచ్ లో సందడి చేస్తున్నాడు. ఏదో తన ఎంజాయ్ మెంట్ కోసం సందడి చేయడం లేదు.. తన అభిమానులను, తెలుగు సినీ అభిమానులను ఎంటర్టైన్ చెయ్యడం కోసం గోవాలో సందడి చేస్తున్నాడు. అది కూడా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం చేయడమే విశేషం. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ పూరి జగన్నాధ్ ల మూవీ షూటింగ్ డే అండ్ నైట్ గ్యాప్ లేకుండా గోవాలో జరుగుతోంది.
కొద్ది రోజుల క్రితమే ఎన్.టి.ఆర్ మూవీ గోవా షెడ్యూల్ నవంబర్ 23 వరకూ జరగనుందని తెలియజేసాము. కానీ తాజా సమాచారం ప్రకారం గోవా షెడ్యూల్ ని అనుకున్న టైం కంటే ఎక్కువగా పొడిగించారు. మరో ఐదు నుంచి ఆరు రోజులు ఎక్కువగా గోవాలో షూట్ చేయనున్నారు. అంటే ఈ నెలాఖరు వరకూ అక్కడే షూటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్లో ఎన్.టి.ఆర్ తో పాటు ప్రకాష్ రాజ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, వెన్నెల కిషోర్ కూడా పాల్గొంటున్నారు.
ఇప్పటి వరకూ జరిగిన గోవా షెడ్యూల్ లో ఎన్.టి.ఆర్ – విలన్ పై వచ్చే సన్నివేశాలతో పాటు హీరో – హీరోయిన్ పై వచ్చే సన్నివేశాలను కూడా షూట్ చేసారు. వక్కంతం వంశీ అందించిన కథకి పూరి మార్క్ డైలాగ్స్ మరియు టేకింగ్ హైలైట్ అవుతాయని ఈ చిత్ర టీం అంటోంది. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.