‘బాహుబలి’ ట్రైలర్‌కు స్టన్నింగ్ రెస్పాన్స్!

Baahubali
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను ఇంతకుముందెన్నడూ ఎరుగని రీతిలో చాలా వినూత్నంగా విడుదల చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే! తానేది చేసినా సరికొత్తగా ఉండాలనుకునే దర్శకుడు రాజమౌళి, బాహుబలి ట్రైలర్ రిలీజ్‌లోనూ తన మార్క్ చూపెట్టారు.

ఈ ఉదయం 10:30కు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లోని 250కి పైగా థియేటర్లలో బాహుబలి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కోసం అభిమానులు అన్ని చోట్లా బారులు తీరడం విశేషం. అభిమానులు ఎంతో ఉత్సాహంగా ట్రైలర్‌ను ఎంజాయ్ చేశారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన బాహుబలి ట్రైలర్‌ను చూసినవారంతా అద్భుతమైన అనుభూతికి లోనైనట్లు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ప్రభాస్, రానాల స్టన్నింగ్ లుక్స్, రాజమౌళి మార్క్ టేకింగ్, ఎమ్.ఎమ్.కీరవాణి స్టన్నింగ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్‌తో బాహుబలి ట్రైలర్ సూపర్బ్ అనిపించుకుంది. ఇక “నన్నెప్పుడూ చూడని కళ్ళు దేవుడిలా చూస్తున్నాయి.. నేనేవర్ణి?” అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌కు అభిమానులు ఈలలతో థియేటర్లలో హల్‌చల్ చేశారు. రెండు నిమిషాల ట్రైలరే ఈ స్థాయి అనుభూతి కలిగిస్తే, ఇక పూర్తి సినిమా ఇంకెంత అద్భుతమైన అనుభూతి కలిగిస్తుందోనని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అంతా అనుకున్నట్టుగానే బాహుబలి ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఆన్‌లైన్లో ట్రైలర్ చూడదల్చిన వారు మాత్రం తమ ఎగ్జైట్‌మెంట్‌ను సాయంత్రం 5 గంటల వరకూ ఆపుకోవాల్సిందే! ప్రభాస్, రానా, అనుష్కలు అభిమానులు అడిగే ప్రశ్నలకు ట్విట్టర్‌లో సమాధానాలిస్తూ సాయంత్రం 5 గంటలప్పుడు ట్రైలర్‌ను విడుదల చేస్తారు.

Exit mobile version