అందాల భామ సాయి పల్లవి సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎన్నో బాలీవుడ్ ఆఫర్లను తిరస్కరించిన తర్వాత, ఆమె చివరకు అమీర్ ఖాన్ నిర్మించిన ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ తెరకు పరిచయమైంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. మే డే సందర్భంగా విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం తలకిందులైంది.
ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు అత్యంత నిరాశాజనకంగా ఉన్నాయి. అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థ మరియు సాయి పల్లవి లాంటి క్రేజీ నటి ఉన్నప్పటికీ, ఒక హిందీ సినిమాకు ఈ స్థాయిలో తక్కువ ఓపెనింగ్స్ రావడం చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. ప్రేక్షకులకు మరియు యువతకు ఈ రొమాంటిక్ కథాంశంపై పెద్దగా ఆసక్తి కలగకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2016 నాటి థాయ్ సినిమా ‘వన్ డే’కి రీమేక్‌గా తెరకెక్కింది. సినిమా ప్రమోషన్ల కోసం చిత్ర బృందం నార్త్‌లో బాగానే తిరిగింది. అలాగే ఇటీవల ముంబై ప్రీమియర్ షోలో అమీర్ ఖాన్ కన్నీరు పెట్టుకున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. అయితే, సినిమాలో సాయి పల్లవి నటనకు ప్రశంసలు దక్కినప్పటికీ, ఆమె కష్టమంతా వృధా అయిందని క్రిటిక్స్ చెబుతున్నారు. మొత్తానికి ‘ఫిదా’ భామకు బాలీవుడ్ డెబ్యూ మూవీతోనే గట్టి షాక్ తగిలిందని చెప్పాలి.
