ఫీచర్ : రాజమౌళి.. ఇండియన్ సినిమాకు ఓ కొత్త ఐకాన్!

rajmouli-director

శ్రీశైల శ్రీ రాజమౌళి.. అందరికీ ఎస్.ఎస్.రాజమౌళిగా పరిచయమున్న దర్శక ధీరుడి పూర్తి పేరు. ‘బాహుబలి’ అనే ఒక ప్రభంజనంతో ఇండియన్ సినిమాకు ఓ సరికొత్త ఆశాదీపంగా మారిపోయిన ఈ దర్శకుడి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ పరంగా ‘ఇండియన్ సినిమా’ అంటే ఒక్క బాలీవుడ్ మాత్రమే, ‘సౌతిండియన్ సినిమా’ అంటే ఒక్క తమిళ సినిమా మాత్రమే! అన్న ఆలోచనలు, అభిప్రాయాలున్న నేపథ్యంలో ‘బాహుబలి’ అనే ఒక ప్రాంతీయ భాషా సినిమాను ‘ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్‌’గా ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత రాజమౌళికి దక్కుతుంది.

‘మగధీర’కు ముందువరకూ కూడా ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను అందించిన రాజమౌళి, అప్పటికి కేవలం తెలుగు సినిమాకే పరిమితం. ‘మగధీర’ అనే ఓ విజువల్ ఫీస్ట్‌తో మాత్రం ఆయన స్థాయి, ‘రాజమౌళి సినిమా’ పరిధి సౌతిండియా మొత్తం పాకింది. సినిమా అనేది ఓ కళాత్మక వ్యాపారం. ఇక్కడ కళను నమ్ముకొనే సినిమాలు తీసినా, ఆ సినిమాకు వ్యాపారకోణం అనే మరో అంశం బలంగా వెంటాడుతూ ఉంటుంది. ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేస్తూ సినిమాలు తీసే దర్శకులే ఆయా కాలాల్లో ప్రత్యేకత చాటుకోగలుగుతారు. రాజమౌళి ఈ విషయాన్ని బలంగా ఒడిసిపట్టి సినిమాలు తీసే దర్శకుల్లో ఒకరు.

‘మగధీర’ తర్వాత తనదంటూ ఒక బ్రాండ్ సెట్ అయ్యాక రాజమౌళి ‘ఈగ’తో మరో అద్భుతమైన ప్రయోగం చేశారు. స్టార్ హీరోలు లేకుండానే రాజమౌళి చేసిన ఈ ప్రయోగం దర్శకుడిగా రాజమౌళిని ఎక్కడికో తీసుకెళ్ళడమే కాక, పలు అంతర్జాతీయ వేదికలపై ఆయనకు ఓ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇక ‘ఈగ’ సినిమా వరకూ రాజమౌళి ప్రయాణం ఒక ఎత్తు, ఆ తర్వాత ఆయన ఆవిష్కరించిన ‘బాహుబలి’ అనే ప్రభంజనంతో మొదలైన ప్రయాణం మరో ఎత్తు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కడం, సుమారు 3000కు పైనే విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్‌తో రూపొందిన విజువల్ వండర్ కావడం, ఒక ప్రాంతీయ సినిమా ఊహకు కూడా అందని కలెక్షన్స్ సాధించడం, అంతర్జాతీయ సినిమాగా పేరు తెచ్చుకోవడం, పలు హాలీవుడ్ మ్యాగజైన్స్ ప్రశంసలతో ముంచెత్తడం, ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సత్తా చాటడం.. ఇవన్నీ దర్శక ధీరుడు రూపొందించిన ‘బాహుబలి’ సినిమా సాధించిన అద్భుతమైన విజయాలు.

‘బాహుబలి’ లాంటి సినిమా చేయాలన్న ఆలోచన రావడం, అందుకు అన్నివిధాలా శ్రమించడం, ఒక విజువల్ వండర్‌ను తెరకెక్కించడం.. దర్శకుడిగా రాజమౌళి సాధించిన విజయం ఇక్కడితో ఆగిపోలేదు. విడుదలకు ముందు సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ మాట్లాడుకునేలా చేయడం, పలు అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీలతో బాక్సాఫీస్ పొటెన్షియల్‌ను ఎన్నో రెట్లు పెంచడం.. ఇవి కూడా రాజమౌళి సాధించిన విజయాలే! దర్శకుడిగా తాను అనుకున్న కథను ప్రేక్షకులకు చెప్పడంలో 100% కష్టపడడంతో పాటు, ఆ కథను ప్రేక్షకుడికి సరైన స్ట్రాటజీతో చేర్చాలని రాజమౌళి చేసే ప్రయత్నమే ఆయనకు దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ లక్షణాలు, గుర్తింపును ఆధారంగా చేసుకునే పలువురు ప్రఖ్యాత దర్శకులు, సినీ లెజ్ండ్స్.. ఇండియన్ సినిమాకు ఓ సరికొత్త ఐకాన్‌గా రాజమౌళిని అభివర్ణిస్తున్నారు. ‘బాహుబలి’కి కొనసాగింపుగా రానున్న బాహుబలి ది కంక్లూజన్‌తో రాజమౌళి కచ్చితంగా ఇండియన్ సినిమాకు మరో కొత్తదారిని చూపుతారనడంలో సందేహం లేదు.

15 సంవత్సరాల ప్రయాణం.. పది బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతోన్న రాజమౌళి నేడు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ సినిమాకు కొత్త ఐకాన్‌గా పిలవబడుతోన్న రాజమౌళికి 123తెలుగు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Exit mobile version