
దసరా, సంక్రాంతి, వేసవి.. ఓ మూడు సీజన్లూ తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు పండుగ కళను తీసుకొచ్చే సీజన్లుగా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో తమ సినిమాలు విడుదలయితే బాగుంటుందని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతిసారీ ఈ సీజన్లలో సినిమాల హడావుడి మామూలుగా ఉండదు. ఈ దసరా సీజన్‌కూ తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుడిని మెప్పించేందుకు వచ్చేశాయి. అక్టోబర్ 9న తెలుగు భారీ అంచనాలతో విడుదలైన ‘రుద్రమదేవి’ సినిమాతో మొదలైన దసరా సినిమా పండుగ రేపు విడుదలయ్యే మరో మూడు సినిమాలతో కళకళలాడుతోంది.
భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమా అయిన గుణశేఖర్ కలల ప్రాజెక్టు రుద్రమదేవి సినిమా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలై మంచి కలెక్షన్స్ సాధిస్తూ వచ్చింది. ఈ దసరా సీజన్లో మొదటి సినిమా అయిన ‘రుద్రమదేవి’కి మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా మెల్లిగా బాక్సాఫీస్ వద్ద సినిమా మంచి కలెక్షన్లనే సాధిస్తోంది. ఇక ఆ తర్వాతి వారం వచ్చిన రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ ఈ సీజన్లో భారీ క్రేజ్ ఉన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను కొల్లగొడుతోంది. రొటీన్ కథ అన్న టాక్ వినిపించినా, ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం బాగున్నాయనే చెప్పాలి.
ఇక రుద్రమదేవి, బ్రూస్ లీ సినిమాలు దసరాకు ముందే సందడి మొదలుపెడితే, దసరా వారానికి మూడు వేటికవే భిన్నమైన జానర్ సినిమాలైన కంచె, కొలంబస్, రాజుగారి గది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. దసరా కానుకగా రేపు ఈ మూడు సినిమాలూ ఒకేసారి విడుదల కానున్నాయి. విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ‘కంచె’ సినిమా ఇప్పటికే సోషల్ మీడియా ట్రెండింగ్‌గా మారిపోగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయిలో నిలబడుతుందని క్రిష్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సినిమాలో మొట్టమొదటిసారిగా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని ప్రస్తావించిన సినిమా కావడం కంచె సినిమాను ప్రత్యేకంగా నిలిపే విషయం.
ఇక కొలంబస్ సినిమా విషయానికి వస్తే.. ఓ చక్కటి ప్రేమకథగా చెప్పబడుతోన్న ఈ సినిమాలో దర్శకుడు రమేశ్ సామల చెప్పే అంశం సరికొత్తగా ఉంటుందని కొలంబస్ టీమ్ చెబుతూ వస్తోంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమా యూత్ ఆలోచనలకు సరిగ్గా కనెక్ట్ అవుతుందని, టార్గెట్ ఆడియన్స్‌కి బాగా నచ్చే సినిమా అని ప్రచారం పొందుతోంది. ఇక ‘రాజుగారి గది’ సినిమా విషయానికి వస్తే.. బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయిన ఓంకార్ దర్శకుడిగా చేసిన రెండో ప్రయత్నమే ఈ సినిమా. పూర్తి హర్రర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ద్వారానే అందరినీ కట్టిపడేసింది. దీంతో ఈ సినిమా కూడా ఈ దసరాకు ప్రేక్షకులకు క్రేజీగా కనిపిస్తోన్న సినిమాగా చెప్పుకోవచ్చు.
దసరా సీజన్ మొదలైన అక్టోబర్ 9 నుంచి వస్తోన్న సినిమాలను చూసుకుంటే.. రుద్రమదేవి (చారిత్రక సినిమా), బ్రూస్ లీ (ఫ్యామిలీ ఎంటర్టైనర్), కంచె (వార్ డ్రామా), కొలంబస్ (రొమాంటిక్ కామెడీ), రాజుగారి గది (హర్రర్ కామెడీ) ఇలా దేనికదే డిఫరెంట్ సినిమా కావడంతో, ఈ అన్ని సినిమాలకూ బాక్సాఫీస్ వద్ద ఒక సెక్షన్ ఆడియన్స్ మద్దతు ఉంటుందనే విషయంలో సందేహం లేదు. ఈ మద్దతుతో పాటు ప్రేక్షకుడిని కట్టిపడేసే సినిమాలుగా నిలిస్తేనే లాంగ్ రన్‌లోనూ ఆ సినిమాలు గుర్తింపబడతాయ్!