
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 10 నెలలు పూర్తయ్యింది. కానీ తన తదుపరి సినిమా ఇంకా రాలేదు. అందుకే రామ్ చరణ్ తన 9వ సినిమా విషయంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా దసరా కానుకగా సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నాడు. ఇటీవల్ థాయ్ ల్యాండ్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకొని వచ్చిన ఈ చిత్ర టీం ప్రస్తుతం హైదరాబాద్లో రామ్ చరణ్ మరియు కమెడియన్స్ పై వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగష్టు 22న రామ్ చరణ్ 9వ మూవీ టైటిల్ ని అనౌన్స్ చెయ్యడమే కాకుండా, ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం.
ఈ చిత్ర టీం తెలిపిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఫస్ట్ టీజర్ ని రెడీ చేసారు. ఈ రోజు ఉదయం టీజర్ కి సంబందించిన ఫైనల్ కట్ ని ఎడిటర్ సిద్దం చేసాడు. దాంతో ఈ ఫైనల్ టీజర్ కట్ వెర్షన్ ని మ్యూజిక్ కంపోజ్ చేయడం కోసం తమన్ దగ్గరకి పంపారు. తమన్ మరో రెండు రోజుల్లో పర్ఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఫైనల్ టీజర్ ని సిద్దం చేయనున్నాడు. ఇప్పటికే ఈ టీజర్ చూసిన వారు సూపర్బ్ విజువల్స్, ఫ్యాన్స్ కి ట్రీట్ అని అంటున్నారు. ఆగష్టు 22న ఈ ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం మెరుపు, బ్రూస్ లీ, ఫైటర్, విజేత అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు.
కామెడీకి యాక్షన్ ని మిక్స్ చేసి చెప్పడంలో స్పెషలిస్ట్ అయిన శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తన మార్క్ కామెడీ బాగా ఎక్కువగా ఉంటుందని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు. డివివి దానయ్య నిర్మాత.