
ఆర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ‘సైజ్ జీరో’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! పీవీపీ సంస్థలో రూపొందుతోన్న ఈ సినిమాకు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఈ సినిమాలో అనుష్క ఇప్పటివరకూ కనిపించని ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. తమిళంలో ఈ సినిమా ‘ఇంజి ఇడుప్పజాగి’ పేరుతో తెరకెక్కుతోంది.
‘సైజ్ జీరో’ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ మధ్యే విడుదలైన ‘సైజ్ జీరో’ టైటిల్ లోగోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బరువు కొలిచే పరికరంపై ‘సైజ్‌జీరో’ అన్న లోగోను ఉంచి ‘రో’ను కథను ప్రతిబింబించేదిగా పెట్టుకొని చేసిన ప్రయత్నానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ‘సన్నజాజి నడుము’ అన్న ట్యాగ్‌లైన్ బాగా ఆకట్టుకుంటోంది. లోగోకు వచ్చిన రెస్పాన్స్ పట్ల ఆనందంగా ఉన్న సినిమా యూనిట్ ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నారు.
సెప్టెంబర్ 6న కౌలాలంపూర్ ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ పెద్ద ఎత్తున జరిపేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ‘సైజ్ జీరో’ సినిమాలో కొంత భాగం ఎక్కువ బరువున్న వ్యక్తిగా కనిపిస్తూ తర్వాత ‘సైజ్‌జీరో’కు మారిపోయే పాత్రలో అనుష్క కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆమె 25 కిలోల బరువు పెరిగి మళ్ళీ సన్నబడ్డారని సమాచారం. పూర్తి రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఈషా గుప్త, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.