
సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా శుక్రవారం భారీ ఎత్తున విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే! మొదటి షో నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా రాబడుతూ బాక్సాఫీస్ వద్ద ‘శ్రీమంతుడు’ తన సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత ఇంగ్లీష్ మ్యాగజైన్ ఫోర్బ్స్, మహేష్‌పై ఓ కథనాన్ని ప్రచురించింది. ‘సౌతిండియన్ స్టార్ మహేష్ శ్రీమంతుడుతో ఓ సాహసం చేశారు’ అనే శీర్షికన ఫోర్బ్స్ మహేష్‌పై కథనాన్ని ప్రచురించింది.
‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ లాంటి రెండు వరుస పరాజయాల తర్వాత వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాకు మహేష్ స్వయంగా ఓ నిర్మాత కూడా కావడం ఓ సాహసమే అని తెలుపుతూ, ఆ సాహసాన్ని మహేష్ విజయం దిశగా దూసుకుపోనివ్వడం విశేషమని ఫోర్బ్స్ తెలిపింది. మొదటి వారాంతం ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించడమే కాక, హిట్ టాక్‌ను కూడా సొంతం చేసుకోవడంతో పుట్టినరోజున మహేష్‌కు శ్రీమంతుడుతో మంచి గిఫ్ట్ దక్కిందని ఫోర్బ్స్ అభిప్రాయపడింది.
ఇక మహేష్ లాంటి ఓ పెద్ద స్టార్ కోట్లలో ఉండే తన రెమ్యూనరేషన్‌ను కాదని, సినిమా నిర్మాణంలోనూ భాగం కావడంతో శ్రీమంతుడు బడ్జెట్ తగ్గి, విడుదలైన వారానికే సినిమాతో సంబంధమున్న వారు లాభాల పట్టే అవకాశాలను తెచ్చిపెట్టిందని ఫోర్బ్స్ ఈ కథనంలో ప్రచురించింది. మైత్రీ మూవీస్‌తో కలిసి మహేష్ తన సొంత బ్యానర్ ఎంబీ ప్రొడక్షన్స్‌పై ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే! శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు.