భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లలో ‘రామాయణం’ ఒకటి. నితీష్ తివారీ దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ఈ విజువల్ వండర్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా వెనుక ఉన్న ప్రధాన నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయాణం ఒక సినీ కథను తలపిస్తుంది.
కేవలం 21 ఏళ్ల వయసులోనే నమిత్ మల్హోత్రా పెద్ద రిస్క్ తీసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వ్యాపారం ప్రారంభించడం కోసం ముంబైలోని తన కుటుంబానికి ఉన్న ఏకైక ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. రూ. 2 కోట్ల రుణం తీసుకుని, ఒక చిన్న గ్యారేజీ నుంచి పని మొదలుపెట్టారు. తన తండ్రితో కలిసి ‘ప్రైమ్ ఫోకస్’ సంస్థను స్థాపించి, సినీ ప్రొడక్షన్ రంగంలో అడుగులు వేశారు.
వ్యాపారం విస్తరిస్తున్న సమయంలో 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. సంస్థ షేర్లు పడిపోవడంతో సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సమయంలో వెనక్కి తగ్గకుండా రుణాలను పునర్వ్యవస్థీకరించి, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) రంగంపై పూర్తి దృష్టి సారించారు.
2014లో లండన్‌కు చెందిన ప్రసిద్ధ విఎఫ్ఎక్స్ స్టూడియో డబుల్ నెగెటివ్‌ను కొనుగోలు చేసి, తన సంస్థతో విలీనం చేశారు. అలా రూపుదిద్దుకున్న ‘DNEG’ సంస్థ ‘ఇన్సెప్షన్’, ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘డ్యూన్’, ‘ఓపెన్‌హైమర్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసి పలు ఆస్కార్ అవార్డులను అందుకుంది. చిన్న గ్యారేజీలో మొదలైన ప్రైమ్ ఫోకస్, నేడు 9,000 మందికి పైగా ఉద్యోగులతో ప్రపంచ స్థాయి సంస్థగా నిలిచింది.
ఇప్పుడు నమిత్ మల్హోత్రా భారతీయ సినిమా పరిధిని పెంచేందుకు సమాయత్తమవుతున్నారు. రెండు భాగాల ‘రామాయణం’ ప్రాజెక్ట్ కోసం దాదాపు $500 మిలియన్లు (రూ. 4,000 కోట్లకు పైగా) వ్యయం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, ప్రమోషన్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండనున్నాయి. భారతీయ పురాణ కథను ప్రపంచ వేదికపై హాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌ల సరసన నిలబెట్టడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
