అంతర్జాతీయ మార్కెట్లో బంగారం (Gold) ధరలు గురువారం నాడు ఊహించని విధంగా ప్రవర్తించాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్న పసిడి ధరలు, ఒక్కసారిగా కుప్పకూలి, ఆ వెంటనే మళ్లీ కోలుకోవడం ఇన్వెస్టర్లను భయాందోళనలకు గురిచేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒక్క ‘ట్రేడింగ్ సెషన్’ (Trading Session) లోనే బంగారం మార్కెట్ విలువ ఏకంగా 5.5 ట్రిలియన్ డాలర్ల (Trillion Dollars) మేర ఊగిసలాడింది.
నిమిషానికి రూ. 5 లక్షల కోట్లు ఆవిరి
‘ది కోబెయిసీ లెటర్’ (The Kobeissi Letter) నివేదిక ప్రకారం.. ఈస్ట్రన్ టైమ్ జోన్ ఉదయం 9:30 నుండి 10:25 గంటల మధ్య (భారత కాలమానం ప్రకారం రాత్రి 8-9 గంటల మధ్య) బంగారం మార్కెట్ విలువ దారుణంగా పడిపోయింది. ఈ ఒక్క గంట వ్యవధిలోనే దాదాపు 3.2 ట్రిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి.
అంటే, సగటున ప్రతి నిమిషానికి 58 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 5 లక్షల కోట్లు) మార్కెట్ నుండి తుడిచిపెట్టుకుపోయాయి. 2008 నాటి ఆర్థిక మాంద్యం (Recession) సమయంలో కూడా బంగారం ఇంతటి తీవ్రమైన ఒడుదొడుకులను (Volatility) చూడలేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
రికార్డు స్థాయి రికవరీ
అయితే, ఈ పతనం ఎక్కువ సేపు నిలవలేదు. ఉదయం 10:25 గంటల తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి (సాయంత్రం 4 గంటలు) బంగారం మళ్లీ పుంజుకుంది. ఈ సమయంలో మార్కెట్ విలువ 2.3 ట్రిలియన్ డాలర్ల మేర పెరిగింది. మొత్తంగా చూస్తే, ఒకే రోజు 3.2 ట్రిలియన్ల నష్టం మరియు 2.3 ట్రిలియన్ల లాభంతో కలిపి.. 5.5 ట్రిలియన్ డాలర్ల భారీ స్వింగ్ (Swing) నమోదైంది.
ధరల పతనానికి కారణాలేంటి?
ప్రాఫిట్ బుకింగ్ (Profit Booking): బంగారం ధరలు రికార్డు స్థాయికి (గ్రాముకు రూ. 18,000 పైమాట) చేరడంతో, ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవడానికి భారీగా అమ్మకాలు (Sell-off) జరిపారు.
ఫెడ్ ఛైర్మన్ మార్పు: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఫెడరల్ రిజర్వ్ (Fed) తదుపరి ఛైర్మన్ గా కెవిన్ వార్ష్ (Kevin Warsh) ను నియమించవచ్చని వార్తలు రావడంతో డాలర్ (Dollar) బలపడింది. ఇది బంగారంపై ఒత్తిడి పెంచింది.
ఈ పరిణామాలతో వెండి (Silver) ధరలు కూడా భారీగా ప్రభావితమయ్యాయి. గురువారం నాటి ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితిని కళ్లకు కట్టినట్లు చూపించాయి.
