టాలీవుడ్ యాక్షన్ హీరో, మ్యాచో స్టార్ గోపీచంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘భరతవర్ష’ అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమా కోసం గోపీచంద్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకోవడం విశేషం. దీనితో పాటు, కుమార్ సాయి అనే నూతన దర్శకుడితో ఆయన మరో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మెజారిటీ భాగం లండన్‌లో జరగనుండగా, సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు.
తాజాగా గోపీచంద్ తన లైనప్‌లో మరో క్రేజీ ప్రాజెక్టును చేర్చాడు. ప్రముఖ స్టంట్ మాస్టర్ వెంకట్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇది పూర్తిస్థాయి హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఈ చిత్రానికి స్వరాలు అందించనుండగా, పలువురు టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు.
ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవం మే 3వ తేదీన హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే, గోపీచంద్ ఈ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో పాల్గొంటాడు.
