గోపీచంద్ కొత్త సినిమాకూ సెంటిమెంట్ టైటిల్!

Gopichand
‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, ‘లౌక్యం’.. ఇలా టైటిల్ చివర ‘ం’ వచ్చే సినిమాలతో మంచి విజయాలు అందుకున్న హీరో గోపీచంద్, తాజాగా తన కొత్త సినిమా విషయంలోనూ ఇదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈమధ్యే పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్‌తో హీరో గోపీచంద్ ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ నెలాఖర్లో విడుదల కానుంది.

ఇక ఇప్పటివరకూ ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ పరిశీలించగా, చివరకు సినిమా యూనిట్ ‘సౌఖ్యం’ అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసిందని తెలుస్తోంది. తన గత హిట్ సినిమాల పరంపరలోనే సౌఖ్యం సినిమా కూడా సెంటిమెంట్‌ను మరోసారి ఋజువు చేస్తుందని గోపీచంద్ భావిస్తున్నారు. ఇక అన్ని కమర్షియల్ అంశాలతో రూపొందుతోన్న ఈ సినిమా సౌఖ్యం అనే టైటిల్ కథరీత్యా సరిగ్గా సరిపోతుందని కూడా సినిమా యూనిట్ చెబుతోంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Exit mobile version