చెన్నైలో గ్రాండ్‌గా బ్రూస్ లీ తమిళ ఆడియో రిలీజ్

bruce-lee-tamil-audio
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందిస్తోన్న బ్రూస్ లీ సినిమా దసరా సీజన్‌కు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో భారీ అంచనాల మధ్యన విడుదలవుతోన్న సినిమా కావడంతో ఈ సినిమా పట్ల అభిమానులు, ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులకూ చేరవేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ తమిళంలోకీ డబ్ చేస్తున్నారు. ఈమధ్యే విడుదలైన తెలుగు ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వస్తుండగా, ఈ ఉదయం తమిళ ఆడియోను కూడా విడుదల చేశారు.

చెన్నైలో పలువురు తమిళ సినీ పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో బ్రూస్ లీ ఆడియో ఆవిష్కరణ వేడుక జరిగింది. తమిళంలో బ్రూస్ లీ 2 పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. ఇక తమిళ ఆడియో లాంచ్‌కు బ్రూస్ లీ దర్శకుడు శ్రీను వైట్ల, హీరోయిన్‌గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌లతో పాటు తమిళ సినీ దర్శకులు గౌతమ్ మీనన్, విష్ణు వర్ధన్, సురేష్ కృష్ణ తదితరులు హాజరై సినిమా మంచి విజయం సాధించాలని కాంక్షించారు. ఇక ఈ ఆడియో లాంచ్ సందర్భంగా థమన్ అందించిన ఆడియోతో పాటు తమిళ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. అక్టోబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున బ్రూస్ లీ విడుదల కానుంది.

Exit mobile version