టేస్టున్న నిర్మాత సాయి కొర్రపాటికి జన్మదిన శుభాకాంక్షలు

sai-korrapati

డిస్ట్రిబ్యూటర్ బళ్ళారి సాయిగా అందరికీ పరిచయం ఉన్న సాయి కొర్రపాటి సినిమాలపై ఉన్న మరింత మక్కువతో వారాహి చలన చిత్రం బ్యానర్ ని స్థాపించి తన మొదటి ప్రయత్నంగానే ఎస్ఎస్ రాజమౌళితో కలిసి ‘ఈగ’ అనే గ్రాఫికల్ మూవీని నిర్మించాడు. ఈ సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ ని కొల్లగొట్టడమే కాకుండా నేషనల్ అవార్డును కూడా తెచ్చి పెట్టింది.

పెద్ద సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాం కాబట్టి తర్వాతి సినిమా టాప్ డైరెక్టర్స్, హీరోస్ తోనే తీయాలని కాకుండా నూతన దర్శకులకి కూడా అవకాశం ఇచ్చి ‘అందాల రాక్షసి’ లాంటి సినిమా తీసి టేస్ట్ ఉన్న నిర్మాత కూడా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ ఈ బ్యానర్ లో వచ్చిన ‘లెజెండ్’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంత పెద్ద హిట్ అందుకున్నా మళ్ళీ శ్రీని అవసరాలని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇలా హిట్, ఫ్లాప్, ఇమేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న సాయి కొర్రపాటి పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా అయన తన తదుపరి సినిమాల గురించి తెలియజేశాడు. ప్రస్తుతం ఆయన నూతన నటీనటులతో చేస్తున్న ‘తుంగభద్ర’, ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే చంద్ర శేఖర్ యేలేటితో చేయనున్న సినిమా జూలైలో ప్రారంభం కానుంది. అలాగే శ్రీని అవసరాలతో చేయనున్న మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

ఇలా వైవిధ్యమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ, ఇండస్ట్రీలో అందరి చేత టేస్టున్న నిర్మాత అని పించుకుంటున్న సాయి కొర్రపాటి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నాం..

Exit mobile version