టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఒక క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఆయన తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు ఈ డైరెక్టర్. దీంతో ఆయన ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
నిజానికి హరీష్ శంకర్‌కు చిరంజీవి లేదా బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో సినిమా చేయాలనే బలమైన కోరిక ఉంది. గతంలో బాలయ్యకు కథ వినిపించడం, చిరుతో సినిమా చేయాలనే కలను పదే పదే వ్యక్తపరచడం మనకు తెలిసిందే. అయితే ‘ఉస్తాద్’ ఆశించిన విజయం సాధించకపోవడంతో, ప్రస్తుతానికి ఈ ఇద్దరు సీనియర్ హీరోల నుండి అవకాశాలు రావడం కష్టమనే చెప్పాలి.
ఈ పరిస్థితుల్లో హరీష్ మళ్ళీ ఫామ్ లోకి రావాలంటే ఒక మీడియం రేంజ్ హీరోతో బ్లాక్ బస్టర్ కొట్టడం అనివార్యమైంది. గతంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాతో ఎలాగైతే తనను తాను నిరూపించుకున్నాడో, ఇప్పుడు కూడా అదే ఫార్ములాను నమ్ముకుంటున్నాడు. ప్రస్తుతం ఈటీవీ విన్ కోసం ఒక కథ సిద్ధం చేయడంతో పాటు, తన కమ్ బ్యాక్ మూవీ కోసం సరైన హీరో వేటలో ఉన్నాడట ఈ డైరెక్టర్. మరి హరీష్ శంకర్ కమ్ బ్యాక్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.
