సినిమాలతోనే కాదు రియల్ ఎస్టేట్‌తోనూ భారీ ఆర్జన.. ముంబై ప్రాపర్టీతో హృతిక్ రోషన్‌కు నెలకు రూ. 17 లక్షల ఆదాయం!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమాలతోనే కాకుండా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా కూడా క్రమంగా భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. తాజాగా ముంబైలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన బిజినెస్ ప్రాంతంలో ఉన్న తన కమర్షియల్ ఆఫీస్ స్పేస్‌ను భారీ అద్దెకు లీజుకు ఇచ్చి వార్తల్లో నిలిచారు.
ముంబై అందేరీ వెస్ట్ పరిధిలోని ‘లోటస్ నీల్‌కమల్ బిజినెస్ పార్క్’లో ఉన్న తన కమర్షియల్ ప్రాపర్టీని ‘క్లియర్‌సింత్ ల్యాబ్స్ లిమిటెడ్’ అనే సంస్థకు హృతిక్ ఐదేళ్ల కాలానికి లీజుకు ఇచ్చారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ‘సిఆర్ఈ మెట్రిక్స్’ ఈ డీల్ వివరాలను వెల్లడించింది.

ఈ లీజ్ ఒప్పందం ప్రకారం, మొదటి మూడేళ్ల పాటు (ఏప్రిల్ 1, 2026 నుండి మార్చి 31, 2029 వరకు) హృతిక్‌కు నెలకు రూ. 17 లక్షల అద్దె రానుంది. ఆ తర్వాత చివరి రెండేళ్ల కాలానికి (ఏప్రిల్ 1, 2029 నుండి మార్చి 31, 2031 వరకు) అద్దె నెలకు రూ. 19.55 లక్షలకు పెరుగుతుంది. ఈ ఒప్పందానికి సంబంధించి సదరు సంస్థ ఇప్పటికే రూ. 68 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది.

6,000 చదరపు అడుగుల విస్తీర్ణం

న్యూ లింక్ రోడ్‌లోని లోటస్ నీల్‌కమల్ బిజినెస్ పార్క్ పై అంతస్తులో ఉన్న ఈ ప్రాపర్టీ సుమారు 6,000 చదరపు అడుగుల బిల్ట్-అప్ విస్తీర్ణంలో ఉంది. ఇందులో 7 కమర్షియల్ యూనిట్లతో పాటు 7 ప్రత్యేక కార్ పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. ఈ ఆఫీస్ స్పేస్ లీజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 29న పూర్తయింది.

హృతిక్ రోషన్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో వరుస పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే గోరేగావ్‌లోని లోటస్ కార్పొరేట్ పార్క్‌లోని ఆఫీస్ స్పేస్‌ను నెలకు రూ. 5.62 లక్షలకు, పుణే ఖరాడీలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆఫీస్‌ను నెలకు రూ. 6.08 లక్షలకు లీజుకు ఇచ్చారు. హృతిక్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ముంబై కమర్షియల్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.

Exit mobile version